కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ వరస్ట్?? - భారత్‌ను అక్కడకు చేరుస్తుందా?
కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరస్ట్ అంటూ ఓ ఆంగ్ల పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఏపీలో ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల తీరు చూస్తుంటే త్వరలోనే భారత్‌ను కరోనా కేసుల్లో మొదటి స్థానానికి చేర్చే అవకాశం ఉన్నట్టుగా ఉందని పేర్కొంది.
అంతేకాకుండా, అమెరికా, బ్రెజిల్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే కొత్త కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని.. ప్రపంచంలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటిగా మారిందని ఆ ఆంగ్ల పత్రిక తన తాజా ప్రత్యేక కథనంలో పేర్కొంది.
పరిపాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ‘ఇండియా టుడే’ మూడో ర్యాంకు ఇచ్చిందంటూ ఆయన సొంత పత్రిక పతాక శీర్షికన ప్రచురించింది. కానీ కరోనా విషయానికి వస్తే రాష్ట్రం గడ్డు పరిస్థితిలో ఉందని.. ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో దేశంలోనే నంబర్ వన్‌గా మారుతుందని.. ప్రస్తుతం ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న భారతదేశాన్ని.. ప్రథమ స్థానానికి తీసుకెళ్తుందని అదే ‘ఇండియా టుడే’ పేర్కొంది.
కరోనా విషయంలో తొలుత రాష్ట్రం స్థానికం నుంచి జాతీయ స్థాయికి.. ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరుకుందని తెలిపింది. కట్టడి జోన్లను ప్రకటించినా.. అక్కడ వైరస్ నియంత్రణ చర్యలు లేవు. ప్రతి ఒక్కరినీ పరీక్షించకపోవడం .. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని నిలువరించి ప్రత్యేక పరీక్షలు చేపట్టకపోవడమూ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రతను పెంచేసిందని వివరించింది.
ఆంధ్రలో తొలి కరోనా కేసు మార్చి 12న నమోదైంది. ఇటలీ నుంచి నెల్లూరు వచ్చిన ఓ యువకుడికి వైరస్ సోకింది. తొలి మరణం ఆ నెలాఖరులో విజయవాడలో చోటు చేసుకుంది. ప్రస్తుతం కేసుల సంఖ్యలో దేశంలోనే మూడో స్థానానికి చేరుకుంది. జూన్ ప్రారంభం నాటికి 4 వేల లోపున కేసులు ఉండగా.. జూలై మొదటికి 15 వేలకు చేరుకున్నాయి. ఆగస్టు ఆరంభం నాటికి లక్షన్నర దాటాయి. ఇపుడు 2.25 లక్షల వరకు చేరిన విషయం తెల్సిందే. కేవలం వారం రోజుల్లో ఈ కేసుల సంఖ్య 2.25 లక్షలు దాటిపోయింది.
పైగా, ఇతర రాష్ట్రాలన్నిటి కంటే అత్యంత వేగంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఇక్కడ 10.84 రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య రెట్టింపు అవుతుంటే.. జార్ఘండ్‌లో 11.31 రోజులకు.. బిహార్‌లో 13.91 రోజులకు.. అసోంలో 14.48 రోజులకు.. ఉత్తరప్రదేశ్‌లో 15.98 రోజులకు, కర్ణాటకలో 16.13 రోజులకు.. కేరళలో 16.49 రోజులకు.. ఒడిశాలో 16.5 రోజులకు.. పంజాబ్‌లో 16.68 రోజులకు.. బెంగాల్లో 19.25 రోజులకు కేసులు రెట్టింపు అవుతున్నాయి.
అంతేకాకుండా, వైరస్ వ్యాపించిన మొదట్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండేది. జూన్ నెలాఖరు వరకు ప్రతి రోజూ కేసుల సంఖ్యలో ఆ రాష్ట్రమే ఫస్టు. తర్వాత ఢిల్లీ దూసుకెళ్లింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ స్థానంలోకి వచ్చింది. ప్రపంచంలో కరోనా విజృంభిస్తున్న ప్రాంతాల్లో ఆంధ్ర కూడా ఉంది. అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే కావడం గమనార్హం.