ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (19:48 IST)

ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ : మహమ్మారి మరణ మృదంగం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ అవి అదుపులోకి రావడంలేదు. ఫలితంగా ప్రతి రోజు అటూఇటుగా 10 వేల కేసులు నమోదవుతున్నాయి. 
 
గత 24 గంటల్లో కొత్తగా 9,024 కేసులు నమోదయ్యాయి. 87 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 58,315 మంది శాంపిల్స్‌ని పరీక్షించారు. 
 
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,372 కేసులు నమోదు కాగా తర్వాతి స్థానంలో కర్నూలు 1,138 ఉంది. 342 కొత్త కేసులతో కృష్ణా జిల్లా మెరుగైన స్థితిలో ఉంది.
 
తాజా కేసులతో ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,44,549కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 2,203కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 87,597 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
 
కరోనా నివారణ చర్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా మోడీకి ఏపీ సీఎం జగన్ పలు వివరాలు తెలిపారు. ఏపీలో 25 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశామని జగన్ చెప్పారు. ప్రతి 10 లక్షల మందికి 47,459 మందికి పరీక్షలు చేశామన్నారు. 
 
తాము సాధ్యమైనంత త్వరగా పాజిటివ్ కేసులను గుర్తిస్తున్నామని ఆయన చెప్పారు. పాజిటివ్ కేసుల గుర్తింపుతో మరణాలను అదుపులో ఉంచే అవకాశం ఉంటుందని తెలిపారు.
 
తాము వైద్య సదుపాయం అందించడమే కాకుండా రోగులను ఐసోలేషన్ చేస్తున్నామని జగన్ చెప్పారు. కరోనా వచ్చే నాటికి రాష్ట్రంలో వైరాలజీ ల్యాబ్ కూడా లేదని ఆయన వివరించారు. ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ ల్యాబులు ఉన్నాయని చెప్పారు. 
 
రాష్ట్రంలో 2 లక్షల మంది వాలంటీర్లు కరోనా నివారణ చర్యల్లో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రతిరోజు 9 నుంచి 10 వేల కేసులు నమోదవుతున్నాయని చెప్పారు.