దేశానికి గుండెకాయలాంటి రాష్ట్రానికే మూడు లేవు.. జగన్‌కు షాకిచ్చిన బీజేపీ!!
దేశంలో అతిపెద్ద రాష్ట్రంగానే కాకుండా, దేశానికి గుండెకాయగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఒకే ఒక రాజధాని వుంది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలతో పాటు.. 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్రం దేశానికి గుండెకాయవంటిందని అంటుంటారు. అంతటి పెద్ద రాష్ట్రానికే మూడు రాజధానులు లేవు. మరి కేవలం 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకంటూ బీజేపీ సూటిగా ప్రశ్నించింది.
ఇదే అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత రాంమాధవ్ స్పందిస్తూ, ప్రపంచంలో దేశంలో ఎక్కడా లేనట్టుగా ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఈ అంశంలో కేంద్రం తన పరిధిలో రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించిందన్నారు.
గత చంద్రబాబు ప్రభుత్వ సమయంలో ఎలా ఉందో.. ఇప్పుడు రాష్ట్ర పరిధి అంశాలపై అలానే కేంద్రం ఉందన్నారు. అంటే దీనర్థం ప్రశ్నించకూడదని కాదని వ్యాఖ్యానించారు. నాలుగు రెట్లు ఉన్న యూపీకి ఒకటే రాజధానిగా లక్నో ఉందని.. అయినా అక్కడి నుంచి పరిపాలన సాగడం లేదా అని ప్రశ్నించారు.
నాడు అమరావతి అవినీతిపై ప్రశ్నించామని.. ఇప్పుడు మూడు రాజధానుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. అదేసమయంలో అమరావతి రైతులకు న్యాయం జరిగేలా మన పోరాటాలు ఉండాలన్నారు.
ప్రస్తుతం ఆ విషయం కోర్టులో ఉన్న కారణంగా.. కాస్త వేచి చూడాలని తెలిపారు. రాష్ట్రంలో మూడు రాజధానులనేవి అవినీతికి ఆలవాలం కాకుండా.. అమరావతి రైతులకు నష్టం జరగకుండా చూసుకోవలసిన బాధ్యత ఉందన్నారు.