గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 ఆగస్టు 2020 (08:44 IST)

కోవిడ్ కేర్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోవిడ్ కేర్ సెంటరులో భారీ అగ్నిప్రమాదం సంభించింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం స్వర్ణా ప్యాలెస్ హోటల్‌లో జరిగింది. ఈ హోటల్‌ను రమేశ్ హాస్పిటల్స్ యాజమాన్యం తమ కరోనా చికిత్సా పెయిడ్ కేంద్రంగా వినియోగిస్తోంది. 
 
ఈ భవంతిలో ప్రస్తుతం దాదాపు 40 మందికి పైగా కరోనా బాధితులు, 10 మంది వరకూ వైద్య బృందం ఉన్నట్టు సమాచారం. మంటలతో భవనమంతా దట్టమైన పొగలు వ్యాపించగా, ఊపిరాడని బాధితులు కిటికీల వద్దకు వచ్చి కేకలు వేస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 
 
ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొందరు బాధితులు ఇప్పటికే సొమ్మసిల్లి పడిపోగా, వారిని లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్ కొవిడ్ కేర్ సెంటర్‌కు తరలిస్తున్నారు. కంప్యూటర్ గదిలో ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించింది. 
 
కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు చనిపోగా... ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ పెయిడ్ కోవిడ్ కేర్ సెంటరులోని కరోనా రోగులను 15 అంబులెన్స్‌లలో వివిధ ఆస్పత్రులకు తరలించారు. 
 
మంటల్లో చిక్కుకుంటామన్న భయంతో భవనం పైనుంచి దూకిన ఇద్దరు సిబ్బంది పరిస్థితి విషమంగా ఉంది. షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీపీ శ్రీనివాసులు పేర్కొన్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.