శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 జనవరి 2024 (16:07 IST)

చిన్నారి ప్రాణం తీసిన నిమ్మకాయ.. ఎలా?

lemon
ఏపీలోని అనంతపురం జిల్లా మల్లేనిపల్లిలో ఒక నిమ్మకాయ ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఈ విషాదకర ఘటన బుధవారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లి గ్రామానికి చెందిన సకీదీప, గోవిందరాజులు దంపతులకు ఏడేళ్ల తర్వాత ఓ బిడ్డ పుట్టింది. సంతానం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన ఆ జంట.. లేకలేక పుట్టిన బిడ్డను అపురూపంగా పెంచుకుంటూ వస్తుంది. 
 
పాపకు జశ్విత అని పేరు పెట్టగా, ప్రస్తుతం జశ్విత వయసు తొమ్మిది నెలలు. ఈ క్రమంలో బుధవారం పాప ఆడుకుంటుండగా తల్లి సకీదీప వంటింట్లో పనిచేసుకుంటోంది. ఇంతలోనే చేతికందిన ఓ నిమ్మకాయను జశ్విత నోట్లో పెట్టుకుంది.
 
తల్లి గమనించి బయటికి తీసేందుకు ప్రయత్నించగా అది పాప గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో చిన్నారికి ఊపిరి అందలేదు. హుటాహుటిన పాపను పెద్దవడుగూరు ఆసుపత్రికి తరలించగా.. వైద్యుల సూచనతో అక్కడి నుంచి పామిడి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
 
అయితే, ఊపిరి ఆడకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లే దారిలోనే చిన్నారి జశ్విత కన్నుమూసింది. పామిడి ఆసుపత్రిలో జశ్వితను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే పాప చనిపోయిందని చెప్పడంతో తల్లిదండ్రులు సకీదీప, గోవిందరాజులు కన్నీరుమున్నీరయ్యారు. జశ్విత మృతితో మల్లేనిపల్లిలో విషాదం నెలకొంది.