మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 జనవరి 2024 (13:33 IST)

జనసేనాని చెంతకు ముద్రగడ పద్మనాభం?

mudragada padmanabham
ఏపీలోని రాష్ట్ర రాజకీయ నేతల్లో కీలక నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం పార్టీ మారనున్నారు. ఆయన జనసేన లేదా టీడీపీల్లో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైకాపా నుంచి టీడీపీలోకి, టీడీపీ నుంచి వైకాపాలోకి ఇప్పటికే వలసలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా, మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. 
 
కాపునేత ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని, అందులో భాగంగా జనసేనలో చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ఆయన పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్నట్టు తెలుస్తోంది. కాకినాడ కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లిన జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, తాతాజీ, కాపు జేఏసీ నేతలు సమాలోచనలు జరిపారు.
 
అయితే, తాము ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశామని నేతలు తెలిపారు. మరోవైపు, మరో రెండుమూడు రోజుల్లో జనసేన ముఖ్యనేతలు ముద్రగడను కలిసే అవకాశం ఉందని సమాచారం. జనసేన నేతలు తనను కలవడంపై ముద్రగడ పెదవి విప్పడం లేదు. అంతేకాదు, ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయంలోనూ కుటుంబ సభ్యులు మౌనం పాటిస్తున్నారు.
 
కాగా, ఈ నెల 4న కాపునేతలకు లేఖ రాసిన పవన్.. వారు తనను దూషించినా దీవెనల్లానే స్వీకరిస్తానని తెలిపారు. కాపులను అధికార వైసీపీ రెచ్చగొడుతోందని, ఆ కుట్రలో పావులుగా మారొద్దని విజ్ఞప్తి చేశారు. కాపునేతలకు జనసేన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. అంతలోనే ఇప్పుడు ముద్రగడతో జనసేన నేతలు సమావేశం కావడం, ఆయన కూడా త్వరలోనే పవన్‌ను కలుస్తారన్న సమాచారం నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరోమారు హీటెక్కాయి.