1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జనవరి 2024 (12:00 IST)

కాంగ్రెస్ పార్టీ అండమాన్‌లో పని చేయమన్నా చేస్తాను : వైఎస్ షర్మిల (వీడియో)

sharmila
వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి ఆహ్వానించారు. అక్కడ నుంచి నేరుగా ఆమె ఢిల్లీకి వెళ్ళారు. ఆ తర్వాత గురువారం ఉదయం తన భర్త అనిల్‌తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. అలాగే, తన వైఎస్ఆర్ టీపీని కూడా ఆమె హస్తం పార్టీలో విలీనం చేశారు.
 
కాంగ్రెస్‌లో షర్మిల చేరిన నేపథ్యంలో ఆమెకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీలో పదవి ఇస్తారా? ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగిస్తారా? అనేదానిపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే, ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలను ఆమెకు అప్పగించడమే కాకుండా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే, షర్మిల కడప నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది తేలాల్సివుంది. 
 
మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. సీఎస్‌ సహా ముఖ్య అధికారులతో కలిసి బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఆయన గురు, శుక్రవారాల్లో ఢిల్లీలోనే ఉంటారు. సీఎం వెంట సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ తదితరులు ఉన్నారు. గురువారం ఢిల్లీలో నిర్వహించే ఏఐసీసీ సమావేశంలోనూ రేవంత్‌ పాల్గొననున్నారు. 
 
ఈ సందర్భంగా రాష్ట్రంలో కార్పొరేషన్‌ పదవుల భర్తీ, ఇతర అంశాలపై పార్టీ అధిష్ఠానంతో చర్చించనున్నారు. ఈ నెల 14న సీఎం దావోస్‌ పర్యటనకు వెళుతున్నందున ఈలోగా కొన్ని పదవులను భర్తీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారిలో ఎవరెవరికి ఏయే పదవులు ఇవ్వాలనే జాబితాలను ఏఐసీసీ కార్యదర్శులు తయారు చేస్తున్నారు. ఈ జాబితాలపై అధిష్టానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని.. వీటిపై గురువారం హస్తినలో చర్చిస్తారని సమాచారం.