గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (22:00 IST)

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడిదారులకు అవకాశాలు పుష్కరం : మంత్రి బుగ్గన

apinvestment summitt
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలే ఇందుకు నిదర్శనమన్నారు. విశాఖపట్నంలో వచ్చే నెల 3, 4 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పెట్టబడిదారుల సదస్సుకు తమిళనాడు సహా పారిశ్రామికవేత్తలకు మంత్రి బుగ్గన ఆహ్వానం పలికారు. చెన్నైలో శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ  తమిళనాడుతో తెలుగువారి బంధం ఈనాటిది కాదన్నారు. 
 
మంత్రి కుటుంబం మొత్తం విద్య, వాణిజ్యం పరంగా చెన్నైతో ముడిపిన అనుబంధాన్ని పంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తమిళనాడుతో ఎక్కువ సంబంధాలున్నాయని చెప్పారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య సరిహద్దులు పక్కన పెడితే భౌగోళిక, సంస్కృతి, ఆచారాలు దాదాపు ఒకేలా ఉండడం వలన కొత్త చోటులా అనిపించదన్నారు. 
 
చరిత్రలో గమనిస్తే వ్యాపారవేత్తలెప్పుడూ కొత్త చోటులో సాహసాల వైపు మళ్లుతారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమ రంగాలలో ఈ పరిస్థితి మరింత ఎక్కువని స్పష్టంచేశారు. సహజ వనరులు గల ప్రాంతాలే పారిశ్రామికంగా వృద్ధి సాధించాయన్నారు. అందుకు ఉదాహరణే అమెరికా అన్నారు. వందేళ్ల క్రితం ప్రఖ్యాత నగరాలన్నీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో అభివృద్ధిపరంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని అన్నారు. 
 
బెంగళూరు, చెన్నై నగరాల్లో పెరిగిన ట్రాఫిక్‌ను ఉదహరించారు. ఒక నాడు చదువుకునే రోజులలో స్వేచ్ఛగా నడచిన రహదారుల్లో ఇప్పుడు ప్రయాణం ప్రయాసతో మారడం గమనించవచ్చన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రాథమికంగా కావల్సిన వసతుల కల్పనలో కీలకమైన భూమి, విద్యుత్, నీరు వంటి వసతులు అందించడం కూడా కష్టమయ్యే పరిస్థితి ప్రస్తుతం కొన్ని నగరాలకు ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి ఏ ఇబ్బంది లేదని ఎవరైనా చౌకగా, స్వేచ్ఛగా వాణిజ్యం చేసే అవకాశాలు, అపారవనరులకు అక్కడ కొదవలేదన్నారు. 50 వేల ఎకరాల పారిశ్రామిక భూమి పోర్టులు, విమానాశ్రయాలు అనుసంధానమై ఉండడం పారిశ్రామికవేత్తలకు ఏపీలో కలిసొస్తుందన్నారు.
 
ఐటీ , ఫార్మా, పారిశ్రామిక, తయారీ రంగానికి విశాఖ చిరునామాగా మారనుందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న అన్ని వసతులతో పాటు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల మనుషులున్న చోటు విశాఖ అన్నారు. 11.43 వృద్ధి రేటుతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా మారుతోందన్నారు. రూ.2500 కోట్లతో భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. 
 
విశాఖ, రాజమండ్రి, విజయవాడ, కడప, కర్నూలు, తిరుపతిలో ఇప్పటికే సకల సదుపాయాలతో విమానాశ్రయాలున్నాయన్నారు. తయారీ రంగంలో పరిశ్రమల స్థాపనకు కావల్సినవన్నీ ఏపీలో ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, బావనపాడు, కాకినాడ పోర్టుల నిర్మాణం, 5 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, ఇన్ లాండ్ వాటర్ వే లతో చౌక రవాణ, సకల సదుపాయాలకు  ప్రత్యేక దృష్టిసారించిందన్నారు.
 
విద్యుత్ పునరుత్పాదక శక్తిలోనూ ఆంధ్రప్రదేశ్ తనదైన ముద్ర వేస్తోందన్నారు. 176 స్కిల్ కాలేజీలు, 26 నైపుణ్య కళాశాల, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. పాలు పంచదారలా తెలుగువారు ఎక్కడున్న స్థానికులతో కలిసిపోతారని, అన్ని రంగాల్లో పెట్టుబడులకు అవకాశమున్న రాష్ట్రం ఏపీ ఒకటేనని మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 
 
కాగా, చెన్నై రోడ్ షోకు ఎమ్ఎస్ఎమ్ఈ కార్పొరేషన్ ఛైర్మన్ వంకా రవీంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి సుందర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, తమిళనాడు సీఐఐ మాజీ ఛైర్మన్ స్వామినాథన్, ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.