అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటకు కట్టుబడివున్నాం.. మూడు రాజధానులే మా విధానం : బొత్స
ఏపీకి మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటకు కట్టుబడివున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ వేదికగా నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన దానికి తాము మద్దతు ఇచ్చామని తెలిపారు.
మూడు రాజధానులు అనే వార్త మిస్ కమ్యూనికేషన్ అంటూ బెంగుళూరులో జరిగిన పెట్టుబడి సదస్సులో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ఏపీ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.
తాజాగా మంత్రి బొత్స సత్తిబాబు స్పందిస్తూ, మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా చెప్పామన్నారు. మా ముఖ్యమంత్రి జగన్, ఆర్థికమంత్రి బుగ్గనలు అసెబ్లీ చెప్పారని ఆయన గుర్తుచేశారు. దాన్ని తాము అందరం సమర్థించామన్నారు. ఇదే తమ ప్రభుత్వం విధానం అని చెప్పారు. ఇందులో మరోమాటకు, వాదనకు తావులేదన్నారు.
ఆ ప్రకారంగా అమరావతి శాసన రాజధాని, విశాఖ పరిపాలన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అని బొత్స వివరించారు. ఇది ప్రభుత్వ నిర్ణయమని, ఇకనైనా ఇదే కొనసాగుతుందని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడివున్నామని ఉద్ఘాటించారు. 26 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాల్సి వుందన్నారు. ఇక చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం హయాంలో హోల్‌సేల్‌గా అవినీతికి పాల్పడ్డారని, అందుకే ఆయన్ను హోల్‌సేల్‌గా ఇంటికి పంపించారని బొత్స ఎద్దేవా చేశారు.