శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 మార్చి 2021 (09:54 IST)

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం... పటమట లంకలో ఓటేసిన పవన్

Pawan kalyan
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్... సాయంత్రం 5 గంటల వరకూ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 78,71 272 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 
 
మొత్తం 7,915 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో సగానికిపైగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నందున భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 2,320 అత్యంత సమస్యాత్మక, 2,468 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా ప్రకటించారు. వీటిలో విజయవాడలోనే అత్యధికంగా 221, విశాఖపట్నంలో 185, గుంటూరులో 139, కడపలో 137, తిరుపతిలో 130, కర్నూలులో 123 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఇక్కడ ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చేస్తున్నారు.
 
అలాగే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 12 కార్పొరేషన్లలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. అన్ని డివిజన్లకూ నోటిఫికేషన్ విడుదల కాగా.. ఇందులో 3 డివిజన్లను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేసుకుంది.
 
మిగిలిన 47 డివిజన్లకు బుధవారం ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్తగా విలీనమైన పంచాయతీలతో కలిపి ఏలూరు కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 2,88,951 మంది జనాభా ఉన్నారు. వీరిలో 2,47,631 మంది ఓటర్లు తమ ఓటు వేస్తున్నారు. ఇకపోతే.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట లంక, జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 4లో పవన్ కళ్యాణ్ గారు ఓటు వేశారు.