సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "నగర - పుర పోరు"కు సర్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురపాలక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వంసిద్ధం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో మొత్తం 12 నగరపాలక, 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో బుధవారం పోలింగ్‌ జరుగనుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థలో ఎన్నికలపై హైకోర్టు సోమవారం స్టే ఇవ్వడంతో పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. 
 
ఇదిలావుంటే, రాష్ట్రంలో 75 పురపాలక, నగర పంచాయతీలకు ఎస్‌ఈసీ మొదట నోటిఫికేషన్‌ ఇవ్వగా కడప జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. 
 
మిగిలిన చోట్ల బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే పోలింగ్‌లో 78,71,272 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే 90 నుంచి 95 శాతానికిపైగా ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు. మిగిలినవి మంగళవారం సాయంత్రంలోగా అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
 
మొత్తం ఓటర్లలో పురుషులు 38,72,264, మహిళలు 39,97,840, ఇతరులు 1,168 మంది కాగా, పురుషుల కంటే మహిళలు 1.6 శాతం ఎక్కువగా ఉన్నారు. 2,215 డివిజన్‌, వార్డు సభ్యుల స్థానాలకు 7,552 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారం రోజుల పాటు విస్తృతంగా సాగిన ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది.
 
మొత్తం 7,915 పోలింగ్‌ కేంద్రాల్లో సగానికిపైగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నందున భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 2,320 అత్యంత సమస్యాత్మక, 2,468 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా ప్రకటించారు. 
 
వీటిలో విజయవాడలోనే అత్యధికంగా 221, విశాఖపట్నంలో 185, గుంటూరులో 139, కడపలో 137, తిరుపతిలో 130, కర్నూలులో 123 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పోలింగ్‌ కోసం 48,723 మంది ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించనున్నారు.
 
అలాగే, నగరపాలక సంస్థల్లో 21,888, పురపాలక, నగర పంచాయతీల్లో 26,835 మందిని కేటాయించారు. డివిజన్‌, వార్డుల వారీగా ముద్రించిన బ్యాలెట్‌ పత్రాలు, ఇతర సామగ్రితో ఎన్నికల సిబ్బంది మంగళవారం ఉదయం బయల్దేరి తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోనున్నారు. 
 
కాగా, విద్యావంతులు, సామాజిక స్పృహ కలిగిన పట్టణ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం సామాజిక బాధ్యతగా భావించి పోలింగ్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సూచించారు.