సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 మార్చి 2021 (20:49 IST)

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కలిసిన ఆస్ట్రేలియా హైకమిషనర్

ఆస్ట్రేలియా హైకమీషనర్ ఓ ఫారెల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను రాజ్ భవన్‌లో సోమవారం కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న అనేక కార్యక్రమాల వల్ల ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని ఫారెల్ గవర్నర్‌కు తెలియజేశారు.
 
కరోనా మహమ్మారి తీవ్రతరం అవుతున్న వేళ 2020 మేలో తాను బాధ్యతలు స్వీకరించానని, పరిస్థితులను అధిగమించడానికి భారతదేశం చేపడుతున్న చర్యలను నిశితంగా గమనించానని ఆస్ట్రేలియా హైకమిషనర్ చెప్పారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కోవిడ్ -19 టీకా కార్యక్రమం వల్ల ప్రజలు తమ సాధారణ కార్యకలాపాలను కొనసాగించడానికి అవసరమైన ఉపశమనాన్ని పొందగలిగారని, ఆర్థిక వ్యవస్థ కూడా పునరుత్తేజ దశలో ఉందని అన్నారు.
 
ఆస్ట్రేలియా భారత్‌తో వాణిజ్య,పెట్టుబడుల సంబంధాలను ప్రోత్సహించడానికి, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించటానికి తన పర్యటన ఉపకరిస్తుందని  ఓ ఫారెల్ గవర్నర్ కు వివరించారు. విశాఖపట్నంలో ఎపి మెడ్‌టెక్ జోన్, బొగ్గు గనులు, సౌర ఫలకాలు, వాహనాలు, బ్యాటరీల తయారీ, ఖనిజాల అన్వేషణ, ఎలక్ట్రిక్ రంగాలలో పెట్టుబడులను విస్తరించడానికి ఆస్ట్రేలియా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తో ఒప్పందాలు కుదుర్చుకుందని హై కమిషనర్ తెలిపారు. గవర్నర్ శ్రీ హరిచందన్‌ను ఆస్ట్రేలియా సందర్శించాలని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఆహ్వానించారు.
 
గవర్నర్ హరిచందన్ ఆస్ట్రేలియా హైకమిషనర్‌ను మెమెంటో, శాలువతో సత్కరించారు. చెన్నైలోని కాన్సుల్ జనరల్ సారా కిర్లేవ్‌, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికల్ వలవన్, ఎపి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ సిఇఓ జె. సుబ్రమణ్యం, గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.