మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 30 జనవరి 2021 (16:37 IST)

అహింసా ఉద్యమం ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

మహాత్మా గాంధీ నేతృత్వంలోని అహింసా ఉద్యమం ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కేవలం అహింస మాత్రమే దేశానికి స్వేచ్ఛా వాయివులు ప్రసాదించగలదని మహాత్మా గాంధీ విశ్వసించే వారని గవర్నర్ అన్నారు. దేశవ్యాప్తంగా అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్న శుభతరుణంలో మహాత్మాగాంధీ 73వ వర్ధంతిని పురస్కరించుకుని గవర్నర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
 
రాజ్‌భవన్‌ దర్బార్ హాల్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శ్రీ హరిచందన్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశ స్వేచ్ఛ కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన వారందరి జ్ఞాపకార్థం, మహాత్ముడికి గౌరవార్ధం గవర్నర్ శ్రీ హరిచందన్,రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల మౌనం పాటించారు.
 
ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ ఎందరో మహనీయిల త్యాగఫలితంగా భారతావని ఇప్పడు స్వతంత్ర దేశంగా ఫరిడవిల్లుతుందని,  ఇటు సైనికపరంగా, అటు ఆర్థికంగా ప్రపంచంలోనే ముఖ్య శక్తిగా అవతరించిందన్నారు. మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపుకు స్పందించిన దేశ ప్రజలు నాటి శక్తివంతమైన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేసారు.
 
భారతదేశం వదిలి పోవాలని గాంధీజీ బ్రిటిష్ వారిని కోరినప్పుడు శాంతియుత మార్గాలలో బ్రిటిష్ పాలకులను దేశం నుండి తరిమికొట్టవచ్చని నమ్మలేదని గవర్నర్ అన్నారు. అనేక దేశాల నాయకులు మహాత్మా గాంధీని అనుకరించి, వారి స్వేచ్ఛా ఉద్యమాలలో అహింస, సత్యాగ్రహ సూత్రాలను పాటించటం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. శాంతి, అహింసలకు గొప్ప చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడుతున్న జాతిపిత మహాత్మా గాంధీని దేశ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని గవర్నర్ వివరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఇతర అధికారులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.