శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 31 జనవరి 2021 (17:40 IST)

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన గవర్నర్

పోలియో రహిత సమాజ స్ధాపనలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. ఐదు సంవత్సరాల లోపు వయస్సు కలిగిన చిన్నారులు అందరికీ పోలియో చుక్కలు వేయించాలని, ఇంతకు ముందు వేయించినా, తిరిగి వేయించ వచ్చని గవర్నర్ పేర్కొన్నారు.
 
విజయవాడ రాజ్ భవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు ఇవ్వడం ద్వారా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ హరిచందన్ మాట్లాడుతూ ప్రభుత్వాలు నిరంతరంగా చేపడుతున్న చర్యల ఫలితంగా 2011 నుండి భారత దేశంలో ఒక్క పోలియో బాధిత కేసు కూడా నమోదు కాలేదన్నారు.
 
తల్లిదండ్రులు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా తమ ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయించాలని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 52.72 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కల వేయాలన్నది లక్ష్యంగా కలిగి ఉన్నారన్నారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాలలోని చిన్నారులు సమీపంలో పోలీసు పోలియో చుక్కల కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు.
 
కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ అహ్మద్, రాష్ట్ర రోగ నిరోధక అధికారి డాక్టర్ దేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుహాసిని తదితర అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.