పిఎస్‌ఎల్‌వి-సి 51 ప్రయోగం విజయవంతం: ఇస్రో శాస్త్రవేత్తలకు గవర్నర్ బిశ్వభూషణ్ అభినందన
పిఎస్‌ఎల్‌వి-సి 51 ప్రయోగం విజయవంతం కావటం పట్ల ఆంద్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హర్హం వ్యక్తం చేసారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన గవర్నర్ అంతరిక్ష ఆవిష్కరణలలో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. 19 ఉపగ్రహాల ప్రయోగం భారతీయ అంతరిక్ష పరిశోధనల పటుత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతుందన్నారు.
ఇస్రో, బ్రెజిల్ అనుసంధానంతో చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతం కావటం భారతీయులుగా మనందరికీ గర్వ కారణమని గవర్నర్ ప్రస్తుతించారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా, 19 ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లింది. వీటిలో దేశీయ ప్రైవేట్ సంస్థలకు చెందిన 5 ఉపగ్రహాలు, 14 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి.
ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి మొదటిసారి ప్రధాని మోదీ ఫొటో, భగవద్గీత కాపీ, 25 వేల మంది పేర్లను పంపింది. వాటిలో వెయ్యి మంది విదేశీయుల పేర్లతో పాటు చెన్నై విద్యార్ధుల పేర్లు కూడా వుండటం విశేషమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు.