మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (11:12 IST)

పీఎస్‌ఎల్వీ-15 ప్రయోగం సక్సెస్... రోదసీలోకి 19 ఉపగ్రహాలు..

ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సి 51 రాకెట్ విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా మొత్తం 19 ఉపగ్రహాలను నింగిలో ప్రవేశపెట్టారు. 5 ప్రైవేట్ ఉపగ్రహాలు కాగా, 14 దేశీయ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. మొదటిసారి ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇస్రో ఈ ప్రయోగాన్ని చేసింది. ఉదయం 10:24 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగం నిర్వహించారు. బ్రెజిల్‌కు చెందిన అమజానియా 1 ఉపగ్రహాన్ని ఇండియా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.  
 
కాగా, ఈ ప్రయోగం కోసం శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. 25.30 గంటల అనంతరం అంటే ఆదివారం ఉదయం 10.24కు కౌంట్‌డౌన్‌ జీరోకు చేరుకోగానే 19 ఉపగ్రహాలతో ఈ రాకెట్‌ రోదసిలోకి దూసుకుపోయింది. ప్రయోగానంతరం పీఎస్‌ఎల్వీ-సీ51 రాకెట్‌ 1.55 గంటలపాటు రోదసిలో పయనించింది. 
 
బయలుదేరిన 17.23 నిమిషాలకు బ్రెజిల్‌కు చెందిన 637 కిలోల అమెజోనియ-1 ఉపగ్రహాన్ని సూర్యానువర్తన ధృవకక్ష్య(సన్‌ సింక్రనైజ్‌ పోలార్‌ ఆర్బిట్‌)లోకి చేరుకుంది. అనంతరం నాలుగు నిమిషాలలో మిగిలిన 18 బుల్లి ఉపగ్రహాలను కక్ష్యల్లో వదిలిపెట్టింది. ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆదివారం ఉదయం 9.50 నుంచి దూరదర్శన్‌, ఇస్రో వెబ్‌సైట్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఇస్రో ఛైర్మన్‌ శివన్‌, శాస్త్రవేత్తలు శనివారం పీఎస్ఎల్వీ-సీ51 నమూనాతో తిరుపతి వెళ్లి ప్రత్యేక పూజలు చేసిన విషయం తెల్సిందే. 
 
రోదసీలోకి వెళ్లిన ఉపగ్రహాలు ఇవే... 
 
అమెజోనియా-1: ప్రయోగంలో ఇదే ప్రధాన ఉపగ్రహం. భూ పరిశీలన కోసం బ్రెజిల్‌కు చెందిన నేషనల్‌ ఇనిస్ట్యిటూట్‌ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌ దీనిని తయారుచేసింది. అమెజాన్‌ అడవుల పరిశోధనతో పాటు బ్రెజిల్‌లో వ్యవసాయ భూముల సమాచార సేకరణకు ఉపయోగపడనుంది. నాలుగేళ్లు పనిచేస్తుంది. 
 
అమెరికాకు చెందిన 12 స్పేస్‌ బీస్‌ ఉపగ్రహాలు,  ఎస్‌ఏఐ-1 నానో కనెక్టివిటీ-2 ఉపగ్రహం. 
 
డీఆర్‌డీవో ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన సింధునేత్ర ఉపగ్రహం 
 
చెన్నైకి చెందిన స్పేస్‌ కిడ్జి ఇండియా విద్యార్థులతో రూపొందింపజేసిన సతీష్‌ ధవన్‌ శాట్‌(ఎస్‌డీ శాట్‌). ఈ నానో ఉపగ్రహాన్ని రేడియేషన్‌ తరంగాలు, వాతావరణ పరిశోధనకు రూపొందించారు. దీనిలో ప్రధాని మోదీ ఫొటో, ఎస్‌డీ కార్డులో భగవద్గీత, 25 వేల మంది పేర్లు పంపనున్నారు.
 
శ్రీపెరంబుదూర్‌లోని జెప్పియర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థులు తయారుచేసిన జేఐటీశాట్‌, కోయంబత్తూరులోని త్రిశక్తి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విద్యార్థులు రూపొందించిన త్రిశక్తి శాట్‌, నాగపూర్‌లోని జీహెచ్‌ రీరైసోని కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు తయారుచేసిన జీహెచ్‌ఆర్‌సీఈలను కలిపి యూనిటీశాట్‌గా ప్రయోగిస్తున్నారు. రేడియో తరంగాల ప్రసారాలకు ఉపయోగపడేలా వీటిని రూపొందించారు. 
 
అలాగే, పీఎస్‌ఎల్వీ -సీ51 రాకెట్‌లో పంపనున్న 19 ఉపగ్రహాల్లో ఒకటైన సతీశ్‌ ధావన్‌ శాట్‌ను రూపొందించింది ఏడుగురు విద్యార్ధులు. వీరిలో యజ్ఞసాయి, రఘుపతిది తిరుపతి. కీర్తిచంద్‌  హైదరాబాద్‌ వాసి, అబ్దుల్‌ కషిఫ్‌ నల్లగొండకు చెందినవాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన యజ్ఞసాయి ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ చదివాడు. రఘుపతి హమాలీ కుమారుడు. ఎంటెక్‌ చేశాడు. 
 
వీరంతా.. అంతరిక్షం పట్ల ఆసక్తి గలవారికి శిక్షణనిచ్చే స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా సంస్థలో చేరారు. 2017లో కలాం శాట్‌ను, 2018లో కలాం శాట్‌-వి2ను ఈ సంస్థ ఇస్రోతో కలిసి అంతరిక్షంలోకి పంపింది. సంస్థ సీఈవో కేశన్‌ నేతృత్వంలో ఏడుగురు విద్యార్థులు 1.9 కేజీల బుల్లి ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇది పూర్తిగా కమ్యూనికేషన్‌ ఉపగ్రహం. భూమికి 530 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో తిరుగుతుంది. తక్కువ పవర్‌తో ఎక్కువ డేటా వినియోగంపై పరిశోధనలు చేస్తుంది.