నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్
సీనియర్ నటుడు నరేష్ సినీ నిర్మాతల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిర్మాతలు ఆర్టిస్టులను గుర్తించడం లేదన్నారు. కేవలం డబ్బులు ఇస్తే సరిపోతుందనే భావన వారిలో నెలకొందన్నారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "కె-రాంప్" సినిమా విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‍లో నటుడు నరేష్ పాల్గొని మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
'తాను రెండు దశబద్దాలుగా పరిశ్రమలో ఉంటున్నాను. ఈ కాలంలో 200పైగా చిత్రాలకు పైగా నిర్మాతలను చూశాను. చాలా మంది నిర్మాతలు కళాకారులకు కేవలం పారితోషికం ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ కష్టపడి పనిచేసే వారికి డబ్బుతో పాటు గౌరవం కూడా ఇవ్వాలి' అని అన్నారు.
అదేసమయంలో 'కె-ర్యాంప్' నిర్మాత రాజేశ్‌పై నరేష్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఆర్టిస్టులను ఎంతో గౌరవంగా చూసుకుంటారు. అందుకే ఆయన అంటే నాక చాలా ఇష్టం అని అన్నారు. కిరణ్ అబ్బవరం సినిమా హిట్ కావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన నరేశ్... యంగ్ టీమ్ ఎపుడూ కష్టపడి పన చేస్తుంది. ఈ సినిమా విజయం దానికి మంచి నిదర్శనం అని అన్నారు. ఇదిలావుంటే నిర్మాతలను ఉద్దేశించి నరేష్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి.