వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు
ఆ కన్నతల్లి పాలిట కొడుకే కాలయముడయ్యాడు. తల్లిపై అనుమానం పెంచుకున్న ఆ మైనర్ కుమారుడు తల్లిని వెంటాడి, పరుగెత్తుతున్నా వదలకుండా గొడ్డలితో విచక్షణారహితంగా నరికి అత్యంత పాశవికంగా హత్య చేసాడు. ఈ దారుణమైన ఘటన హర్యానా రాష్ట్రంలోని లాడ్వా పోలీసు స్టేషన్ పరిధిలోని కిర్మాచ్ గ్రామంలో చోటుచేసుకున్నది. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. హత్యకు గురైన 45 ఏళ్ల మహిళ తన భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా వుంటోంది.
తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె ఇద్దరి కుమారుల్లో పెద్ద కుమారుడు మూడేళ్ల క్రితం విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు వెళ్లాడు. చిన్న కుమారుడు మాత్రం తన తండ్రి వద్దనే వుంటున్నాడు. తన తల్లి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం వుండటం వల్ల తను విడాకులు తీసుకున్నట్లు చెప్పడంతో తల్లిపై మరింత అనుమానం పెంచుకున్నాడు. దాంతో రెండ్రోజుల క్రితం తన తల్లి గుర్తు తెలియని వ్యక్తితో ఏకాంతంగా గడుపుతున్నట్లు గమనించాడు.
మరుసటి రోజు గొడ్డలి తీసుకుని ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె అతడి నుంచి తప్పించుకుని పారిపోతుండగా వెంటబడి ఆమె ముఖంపై, మెడ పైన గొడ్డలితో అత్యంత పాశవికంగా నరికాడు. ఆమె ఆర్తనాదాలు విన్న పొరుగువారు బయటకు వచ్చేసరికి అతడు అక్కడ నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.