మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (12:08 IST)

ఇస్రో శాస్త్రవేత్తపై విషయ ప్రయోగం! బహిర్గతం చేసిన తపన్ మిశ్రా

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త తపన్ మిశ్రాపై విషయ ప్రయోగం జరిగిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ ద్వారా వెల్లడించారు. గుఢచర్యం ఆపరేషన్‌లో భాగంగానే ఈ విష ప్రయోగం జరిగివుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
తాజాగా ఆయన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెడుతూ, 'సుదీర్ఘ కాలం దాచి ఉంచిన రహస్యం' పేరుతో ఈ విషయాన్ని వెల్లడించారు. 2017 జులైలో తనపై ప్రాణాపాయం కలిగించే స్థాయిలో రసాయనిక ప్రయోగం జరిగిందన్నారు. 
 
దోసెతో పాటూ తెచ్చిన చట్నీలో దీన్ని కలిపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కారణంగా తాను అనారోగ్యం పాలయ్యాయని, ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడ్డానని తపన్ తెలిపారు. చర్మంపై చిన్న బొడిపెలు రావడంతో పాటూ అరచేతిపై చర్మం పెచ్చులుగా ఊడిపోయిందని అన్నారు. 
 
తనపై ఆర్సెనిక్‌ అనే రసాయన ప్రయోగం జరిగినట్టు ఎయిమ్స్ రిపోర్టును కూడా తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో జత చేశారు. 'గూఢచర్య ఆపరేషన్‌లో భాగంగా.. మిలిటరీ, వ్యాపార రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఓ శాస్త్రవేత్తను తొలగించడమే ఈ దాడి వెనుక కారణం అయి ఉండొచ్చు' అని తపన్ వెల్లడించారు. 
 
ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు జరపాలని కూడా ఆయన కోరారు. తపన్ మిశ్రా గతంలో ఇస్రో ఆధ్వర్యంలోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించారు. కాగా, తపన్ మిశ్రా ప్రస్తుతం ఇస్రోలో సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలాఖరున పదవీవిరమణ చేయనున్నారు.