గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జనవరి 2021 (13:42 IST)

కొడాలి నాని కాస్త పేకాట నానిగా మార్చిన పవన్ కళ్యాణ్.. ఎలా?

కృష్ణా జిల్లా గుడివాడలో గుట్టుచప్పుడుకాకుండా సాగుతూ వచ్చిన పేకాట క్లబ్బుల వ్యవహారం ఇపుడు బట్టబయలైంది. సాక్షాత్తూ ఓ కీలక మంత్రి కనుసన్నల్లో సాగుతూ వచ్చిన ఈ పేకాట డెన్‌ గుట్టురట్టయింది. తమిరశ గ్రామంలో ఎస్‌ఈబీ మెరుపు దాడులు జరిపి 30 మంది పేకాట రాయుళ్లను పట్టుని.. 28 కార్లు, రూ.కోట్ల కొద్దీ నగదు స్వాధీనం చేసుకోవడం రాష్ట్రమంతటా సంచలనం సృష్టించింది. ఈ పేకాట శిబిరాలు మంత్రి కొడాలి నాని అనుచరులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. 
 
అసలు ఈ వ్యవహారం ఇపుడు వెలుగులోకి రావడం వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకమని చెప్పొచ్చు. ఇటీవల గుడివాడ పర్యటనలో పవన్ కళ్యాణ్.. మంత్రి కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. గుడివాడ భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. పేకాట క్లబ్‌ల వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. 'మీరు పేకాట క్లబ్‌లు, సిమెంట్ కంపెనీలు, మీడియా సంస్థలను నడపగలిగితే లేనిది.. నేను సినిమాల్లో నటిస్తే తప్పేంటి?' అంటూ సూటిగా ప్రశ్నించారు. 
 
ఈ ఆరోపణలు ఏపీలోని అన్ని రాజకీయా పార్టీల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, అధికార వైకాపాలో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే పవన్ ఆ మాటలు అన్న కొన్ని రోజులకే ఇలా పేకాట క్లబ్‌ దాడులు జరగడం.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది. దాంతో గుడివాడ నాని అంటేనే పేకాట నాని అన్నట్లుగా ఎస్టాబ్లిష్‌ కావడం ఆయన్ని ఇరకాటంలో పడేసిందని చెబుతున్నారు. 
 
అటు పవన్‌ను, ఇటు బీజేపీని సంతృప్తిపరిచేందుకు నానిని అధికారపక్షం టార్గెట్‌ చేసినట్లు గుడివాడలో చెప్పుకుంటున్నారు. అయితే పవన్‌ ఏదైనా ఒక సమస్యపై దృష్టిసారిస్తే పెడితే దానికి ప్రభుత్వం వైపు నుంచి స్పందన ఉంటుందని మరోసారి స్పష్టమవుతోంది. అంతేకాదు ప్రజాసమస్యలపై పోరాడే బాధ్యత పవన్‌పై మరింత పెరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
మరోవైపు మంత్రి కొడాలి నాని సోమవారం తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. పేకాట క్లబ్బుల విషయంలో సీఎం ఆయనకు గట్టి క్లాస్‌ పీకినట్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన కొడాలి నాని.. మీడియా సమావేశంలో అసహనంతో మాట్లాడుతూ, అర్థాంతరంగా వెళ్లిపోయారు. మొత్తంమీద పవన్ కళ్యాణ్ దెబ్బకు మంత్రి కొడాలి నాని కాస్త ఇపుడు పేకాట నానిగా మారిపోయారని అధికార పార్టీకి చెందిన నేతలో వ్యాఖ్యనిస్తుండటం గమనార్హం.