ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిపూట బడులు... నవంబరు 2 నుంచి పునఃప్రారంభం!
కరోనా లాక్డౌన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. నవంబరు రెండో తేదీ నుంచి సుధీర్ఘకాలంగా మూతపడిన స్కూల్స్, కాలేజీల తలుపులు తెరుచుకోనున్నాయి.
నవంబరు 2 నుంచి దశల వారీగా విద్యాసంస్థల పునఃప్రారంభం ఉంటుందని ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించగా, ఆ మేరకు రాష్ట్ర సీఎస్ నీలం సాహ్నీ తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తారు. అది కూడా ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహిస్తారు.
నవంబరు 2 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు, ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులకు క్లాసులు ఉంటాయి. నవంబరు 12 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు క్లాసులు జరుపుతారు. నవంబరు 23 నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులకు బోధన ప్రారంభం అవుతుంది.
ఇకపోతే, 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు డిసెంబరు 14 నుంచి క్లాసులు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
కరోనా నియమావళికి అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని తరగతుల నిర్వహణ జరపాల్సి ఉంటుందని షెడ్యూల్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.