సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 27 మే 2019 (16:43 IST)

అరాచక శక్తులపై ఉక్కుపాదం.. అందుకే డీజీపీగా సవాంగ్ నియామకమా?

నవ్యాంధ్ర కొత్త డీజీపీ (పోలీస్ బాస్)గా గౌతం సవాంగ్ నియమితులు కానున్నారు. ఆయన్ను కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఏరికోరి డీజీపీగా నియమించినట్టు తెలుస్తోంది. ఈయన విజయవాడ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో బెజవాడ రౌడీ మూకల ఆటలు కట్టించడంతో పాటు... అరాచక శక్తుల ఆటలు కట్టించడంలో సఫలీకృతులయ్యారు. దీంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతపై ప్రత్యేక దృష్టిసారించడమే కాకుండా, ఎక్కడైనా అరాచక శక్తులు ఉన్నట్టయితే వాటిని కూకటి వేళ్లతో పెకళించి వేసేందుకు వీలుగా సవాంగ్‌ను జగన్ కేంద్ర హోంశాఖను ఒప్పించి మరీ డీజీపీగా నియమించుకున్నట్టు తెలుస్తోంది. 
 
1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సవాంగ్... మదనపల్లి ఏఎస్పీగా తన పోలీసు సర్వీసులను ప్రారంభించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు, వరంగల్ జిల్లాల ఎస్పీగా పని చేశారు. 2001 నుంచి 2003 వరకు వరంగల్ రేజ్ డీఐజీగా పని చేసిన ఆయన 2003 నుంచి 2005 వరకు ఎస్ఐబీ, ఏపీఎస్పీ విభాగాల్లో డీఐజీగా పని చేశారు. పిమ్మట కేంద్ర సర్వీసులకు వెళ్ళారు. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‍‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. 
 
అంతకుముందు కేంద్ర సర్వీసుల నుంచి తిరిగివచ్చిన తర్వాత విజయవాడ కమిషనరుగా పనిచేశారు. 2018 వరకు సీపీగా పని చేసిన ఈయన.. సంఘ వ్యతిరక శక్తులను అణిచివేయడంలో కీలక పాత్రను పోషించారు. ఇపుడు డీజీపీగా నియమించడంతో జగన్ సంఘ వ్యతిరేక శక్తులతో పాటు అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపేందుకు వీలుగానే డీజీపీగా నియమించారనే వాదనలు వినిపిస్తున్నాయి.