శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 4 నవంబరు 2016 (20:58 IST)

ఏపీ అభివృద్ధికి రాజమార్గాలు...

విజయవాడ : రహదారుల నిర్మాణంతో రాష్ట్రానికి అభివృద్ది పధంలో నడిపించేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. 2029 నాటికి అన్నికాలాలకు అనువైన రోడ్ల సౌకర్యం కల్పించేందుకు సిద్ధమైంది. రాజధాని ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్లే రోడ్లతో అనుసంధానం చేయాలని సంకల్పి

విజయవాడ : రహదారుల నిర్మాణంతో రాష్ట్రానికి అభివృద్ది పధంలో నడిపించేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. 2029 నాటికి  అన్నికాలాలకు అనువైన రోడ్ల సౌకర్యం కల్పించేందుకు సిద్ధమైంది. రాజధాని ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్లే రోడ్లతో అనుసంధానం చేయాలని సంకల్పించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల కిలో మీటర్ల సీసీ రోడ్లు ఉన్నాయి. అయితే వీటిని 34 వేల  కిలోమీటర్లకు పెంచి, 56 వేల కిలోమీటర్లు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 5 వేల కిలో మీటర్ల సిమెంటు రోడ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో 2,480  కిలోమీటర్లు పూర్తి చేశారు. మిగిలిన రోడ్లను కూడా త్వరితగతంగా పూర్తి చేయాలని ఇటీవల నిర్వహించిన సమావేశంలో అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
 
అమరావతిలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి చైనా, బ్రిటన్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. అమరావతిలో అంతర్గత రోడ్లతో పాటు, ఇబ్రహీంపట్నం నుంచి కృష్ణానదిపై రాజధానికి వెళ్లే వంతెన నిర్మాణం, విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులపై కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. సైనోఫోర్టోన్ కంపెనీ.. బ్రిటన్ తో పాటు చైనాలోను ప్రభుత్వాలకు సంబంధించిన పలు కాంట్రాక్టు పనులను చేస్తోంది.
 
విజయవాడ మెట్రో రైల్ నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వ నిధులతోను, విశాఖపట్నం మెట్రో పనుల్ని పీపీపీ పద్ధతిలోను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు, అంతర్గత రోడ్ల నిర్మాణంపైనా బ్రిటన్, చైనా కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేయడంతో.. వాటి ప్రతిపాదనలు పరిశీలించాలని సీఎం చంద్రబాబు మెట్రో కార్పొరేషన్, సీసీడీఎంసీలకు సూచించారు. మరోవైపు ఈ ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు అమరావతికి రావాలని రాష్ట్ర ప్రభుత్వం సదరు కంపెనీల ప్రతినిధులను కోరింది. త్వరలోనే తమ కంపెనీల తరఫున నిపుణుల బృందాన్ని పంపిస్తామని ఆ కంపెనీలు ప్రభుత్వానికి తెలియజేశాయి.
 
గ్రామాలలోని రహదారులను ప్రధాన పట్టణాలతో అనుసంధానం చేయనున్నారు. పంచాయితీరాజ్ రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వంనిర్ణయించింది. ప్రధాన రోడ్లకు అనుసంధానంగా ఉన్న పీఆర్ రోడ్లను ఆర్ అండ్ బీకీ అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల రోడ్ల నిర్వహణ మెరుగుపడటమే కాకుండా.. నాణ్యత కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రతి గ్రామంలోని ప్రజలకు రహదారుల సౌకర్యం కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఇంటి ముందు రహదారి మార్గం ఉండేలా చర్యలు తీసుకోబోతున్నారు. గ్రామాల్లో సింగిల్ రోడ్లు, మండల కేంద్రాల్లో రెండు వరుసల రోడ్లు ఉండేలా నిర్మించబోతున్నారు. అదే విధంగా  జిల్లా కేంద్రాలకు నాలుగు లేదా ఆరు లైన్ల నాణ్యమైన రహదారులను నిర్మించి అనుసంధానం చేయనున్నారు.
 
అన్నిరకాలుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న గుజరాత్.. దేశంలోనే నెంబర్ రాష్ట్రంగా నిలవడానికి కారణం.. అక్కడి రోడ్ల అనుసంధాన వ్యవస్థే.దక్షిణ భారతదేశంలో తమిళనాడు కూడా చక్కటి రోడ్డు నెట్‌వర్క్ కలిగి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా రోడ్ల నిర్మాణం, నిర్వహణలో మెరుగ్గానే ఉండేది. ఏపీలో దాదాపు నాలుగు వేల కి.మీ జాతీయ రహదారులు ఉన్నాయి. మరో772 కిలోమీట‌ర్ల హైవేల నిర్మాణానికి కేంద్రం ఇటీవలే ఆమోదం తెలిపింది. ఇందు కోసం వెయ్యి కోట్ల రూపాయ‌లు విడుదల చేయడానికి కేంద్రం సంసిద్ధత వ్యక్తంచేసింది. ఏపీ రాజధానిలో 186 కిలోమీటర్ల రింగ్‌రోడ్డు నిర్మాణానికి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
అమరావతి నుంచి అనంతపురం, కర్నూలు వరకు 452 కి.మీ హైవే, అమరావతి నుంచి కడప, కర్నూలు, అనంతపురం వరకు 132 కి.మీ రోడ్డుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. అనంతపురం నుంచి అమరావతికి 25 వేల కోట్ల రూపాయలతో ఎక్స్ ప్రెస్ హైవేని నిర్మించనున్నారు. ఈ మార్గం ద్వారా ఎనిమిది గంటల్లో రాజధానకి చేరవచ్చు. అంతేకాకుండా  ప్రధాన ప్రాంతాలన్నిటినీ నౌకాశ్రయాలన్నీటిలో  అనుసంధానం చేయనున్నాయి. ఏపీలో భారీగా జల మార్గాలు ఏర్పాటు చేసి జల రవాణాలో మూడో స్థానంలో ఉన్న ఏపీని, దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు అధికార యంత్రాం పూనుకుంది. దీని ద్వారా ప్రయాణికులు, సరుకుల రవాణా జరగాలన్నది ప్రభుత్వం లక్ష్యం.
 
నౌకాశ్రయాలతో లింకు....
జలరవాణాను వేగంతం చేయడానికి చేపట్టిన సాగరమాల ప్రాజెక్టులో ఏపీ భాగస్వామ్యం కావడంతో రాష్ర్టంలో అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయి. రాష్ర్టంలో పోర్టుల అభివృద్ధితో పాటు రహదారులు, ఇతర మౌలిక సదుపాయలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.8,500 కోట్లు మంజూరు చేయనుంది. వీటితో రూ.3 వేల కోట్లతో కాకినాడలో ఎల్.ఎన్.జి టెర్మినల్ నిర్మించబోతున్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు గోదావరి, కృష్ణా నదుల వెంట జల రవాణాకు చర్యలు తీసుకుంటున్నారు. ఇలా 1,078 కిలో మీటర్ల మేర అంతర్గత జల రవాణా ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేశారు. కృష్ణా - గోదావరి నదుల్లో 328 కిలోమీటర్ల మేర జలమార్గాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు.
 
ఓడరేవులతో  రాష్ట్ర రహదారులతో  కనెక్టివిటీ పెంచి రాష్ట్రం నుంచి  దేశమంతటికీ  రవాణా సౌకర్యం ఉండేలా  చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని రహదారులను జాతీయ రహదారులకు అనుసంధానిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులకు ఈ రహదారులను అనుసంధానించి కారిడార్లుగా వినియోగించుకునేందుకు  వీలుగా ప్రణాళికలు రూపొందించారు. దీనివల్ల సామాన్యులకు చవకైన ప్రయాణం లభిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంటాయి. రహదారుల సదుపాయం  లేని గ్రామలకు  రహదారుల అనుసంధానంతో మెరుగైన రవాణా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.