గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (19:23 IST)

ఏపీకి మరో ముప్పు

ఏపీ సహా తమిళనాడుకు మరో ముప్పు ముంచుకొస్తోంది. దక్షిణ అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. ఇది ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. 15 నాటికి ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముంది. ఆ తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశముందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖాధికారులు.

ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడుతో పాటు ఏపీ కుండపోత వానలతో విలవిలలాడిపోతున్నాయి. ఇంకా పలు గ్రామాలు, పట్టణాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళలో వర్షాలు ఇంకా దంచికొడుతున్నాయి.

మరోవైపు రాత్రి నుంచి కన్యాకుమారి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతోన్న వానలతో జలదిగ్బంధంలో చిక్కుకుంది కన్యాకుమారి. భీకర వానలతో కన్యాకుమారి నుంచి అన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
 
ఇక దక్షిణ కోస్తా, నెల్లూరు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు జనాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో జిల్లాలో 4 కోట్ల రూపాయల వరకు పంటనష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో 36 గంటల్లో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరి, కూరగాయలు, పూలు, వేరుశనగ, చెరకు, రాగి, మొక్కజొన్న పంటలు నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు.
చిత్తూరు జిల్లాలో ఎస్పీడీసీఎల్ కు 3 కోట్ల 20 లక్షల రూపాయల నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు.

445 విద్యుత్ స్తంభాలు, 234 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 13 చెరువులకు గండ్లు పడ్డాయి. దీంతో జిల్లాలో 26 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు అధికారులు. సహాయక శిబిరాల్లో 1315 మందికి పునరావాసం కల్పించారు.

శ్రీకాకుళం జిల్లాను కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. అటు లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో దాదాపు 3 లక్షల హెక్టర్లలో వరి సాగు చేశారు రైతులు.

అయితే అకాల వర్షాలతో భారీగా పంటలు దెబ్బతిన్నాయని అన్నదాతలు వాపోతున్నారు. భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. జిల్లాలో నదులు ఉధృత రూపం దాల్చాయి. పెన్నా నది ఉధృతితో లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు అధికారులు.