గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (09:29 IST)

ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. తనపై సీబీఐ విచారణ నిలిపివేయాలంటూ ఆమె దాఖలుచేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 
 
గతంలో ఓబుళాపురం గనుల తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తేలేవరకూ... ఓఎంసీ కేసులో తనపై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేయాలని ఆమె గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు సెప్టెంబరు 21వ తేదీన కొట్టివేసింది. దీంతో ఆమె సుప్రీంకోర్టు తలుపు తట్టారు. 
 
ఈ పిటిషన్‌పై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఏ.ఎస్‌.బోపన్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. శ్రీలక్ష్మి తరఫున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు. సీబీఐ ఇప్పటికే నాలుగు ఛార్జిషీట్లు దాఖలు చేసిందని, ప్రతిసారీ అదనపు ఛార్జిషీట్ల దాఖలుకు సమయం కోరుతోందని తెలిపారు. 
 
రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తేలలేదని, తొమ్మిదేళ్లుగా సీబీఐ పూర్తిస్థాయిలో అభియోగాలు నమోదు చేయనందున కేసు విచారణను నిలిపివేయాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. 
 
ఇప్పటికే విచారణ ముగింపు దశకు చేరుకుందని సీబీఐ తెలిపిందని, త్వరగా ముగించాల్సిందిగా తాము ఒత్తిడి చేయలేమని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. హైకోర్టు అన్ని అంశాలూ పరిశీలించి తీర్పు ఇచ్చినందున ప్రత్యేకంగా విచారణ చేయాల్సిందేమీ లేదంటూ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది.