గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (14:55 IST)

విమానంలో సిగరెట్ కాల్చిన ప్రయాణికుడు అరెస్టు

కువైట్ నుంచి చెన్నైకు వచ్చిన ఇండిగో విమానంలో సిగరెట్ కాల్చిన ప్రయాణికుడిని విమానాశ్రయ పోలీసులు అరెస్టు చేశారు. సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో పొగతాడగం కూడా నేరం. అలాంటిది ఏకంగా విమానంలో సిగరెట్ కాల్చి అందరినీ ఆందోళనకు గురిచేశాడు. 
 
కువైట్ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో 137 మంది ప్రయాణికులు ఉండగా… అందులో ఏపీకి చెందిన మహ్మద్ షరీఫ్ (57) అనే ప్రయాణికుడు ఉన్నాడు. ఈయన సొంతూరు ఆంధ్రప్రదేశ్. అతడు భద్రతా సిబ్బంది కళ్లు గప్పి తన లో దుస్తుల్లో దాచుకున్న సిగరెట్లను విమానంలోకి తీసుకువచ్చాడు.
 
విమానం టేకాఫ్ అయిన కాసేపటికి స్మోకింగ్ చేయడం ప్రారంభించాడు. తోటి ప్రయాణికులు వారించినా షరీఫ్ వినలేదు. దీంతో వాళ్లు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. చివరకు ఎయిర్‌ హోస్టెస్ వచ్చి చెప్పినా అతడు సిగరెట్ తాగడం ఆపలేదు. 
 
ఈ క్రమంలో ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ సిబ్బందితో షరీఫ్ గొడవకు దిగాడు. దీంతో విమానం చెన్నైలో ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ తర్వాత చెన్నై ఎయిర్‌పోర్టులోని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.