శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2019 (20:23 IST)

కలానికి కులాన్ని ఆపాదించింది ఎవరో చర్చకు సిద్ధమా?: కళా సవాల్

కలానికి కులాన్ని ఆపాదించింది ఎవరో చర్చకు సిద్ధమా అని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు సవాల్ విసిరారు. ఆయన గుంటూరు లో విలేకరులతో మాట్లాడుతూ...

"కలానికి కులం లేదు. కలానికి కులాన్ని ఆపాదించి పత్రికా విలువలను దిగజార్చిన జగన్మోహన్‌రెడ్డి చరిత్ర ప్రజలందరికి తెలుసు. మీడియాపై ఆంక్షలు విధిస్తూ 2007లో అప్పటి వైఎస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం. 938ను తప్పుపట్టిన దేవులపల్లి అమర్‌, రామచంద్రమూర్తులు ఇప్పుడు జగన్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు మద్ధతు తెలపటం సహేతుకం కాదు.

దుష్టబుద్ధి గల ఇద్దరు మంత్రులు కలానికి కులతత్వం, ప్రాంతీయతత్వంతో రెచ్చగొడుతూ మంత్రి స్థాయిని దిగజార్చారు. అవినీతి సాక్షి మీడియాలో వచ్చే వార్తలు, ఇతర మీడియాలో వచ్చే వార్తల్లో మంత్రి చెప్పిన కంపు ఎందులో ఉందో ప్రజలకు తెలుసు.

పచ్చి అవినీతి, పచ్చి విషపు ప్రచారం, పచ్చి అబద్దాలతో పాటు మంత్రి చెప్పిన కంపు ఒక్క సాక్షి మీడియాలో మాత్రమే ఉందో? లేక ఇతర మీడియాలో ఉందో బహిరంగ చర్చకు సిద్ధం. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా జగన్‌ ప్రభుత్వం నల్ల జీవో నెం. 2430ను తీసుకువచ్చింది.

మీడియాపై సంకెళ్లను దేశ వ్యాప్తంగా తప్పుపట్టినా ఇంత వరకు జగన్‌ ప్రభుత్వం ఉపసంహరించుకోకపోవడం నిరంకుశ మనస్థత్వానికి నిదర్శనం. వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పత్రికా స్వేచ్ఛను వాడుకుంది. తప్పుడు కథనాల పేటెంట్‌ సాక్షి మీడియాదేగాని మరెవ్వరిదీ కాదు.

జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకొని నల్ల జీవోను భేషరుతుగా వెనక్కి తీసుకోవాలి, కలానికి కులాన్ని ఆపాదించినందుకు మంత్రులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాం" అని మండిపడ్డారు.