ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (08:12 IST)

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ... 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్

assembly
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 7వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను విత్తమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రెండో రోజైన మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులు ప్రసంగిస్తారు. 
 
కాగా, మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పట్టుబడితే.. దానికి సభానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశంలో సమ్మతిస్తే.. అదనంగా మరొక రోజు సమావేశాలు కొనసాగే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. తొలిరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఉభయస భలూ మంగళవారానికి వాయిదా పడతాయి. 
 
ఆ వెంటనే శాసనసభాపతి తమ్మినేని సీతారాం నేతృత్వంలో శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సభానాయకుడు జగన్, టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు హాజరవుతారు. ప్రశ్నోత్తరాలకు సమయం ఇవ్వాలని ఈ సమావేశంలో టీడీపీ పట్టుబట్టే వీలుంది. చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని పట్టుబట్టేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. 
 
మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. అలాగే, ఎమ్మెల్సీ షేక్ సాబీ మృతి పట్ల శాసనమండలిలో సభ్యులు సమావేశమై సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెడతారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో గతేడాది మాదిరిగానే ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.