శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (14:02 IST)

అసెంబ్లీలో రచ్చరచ్చ.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. పయ్యావుల కేశవ్‌పై...

payyavula
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొత్తం ఐదు రోజుల పాటు సాగే ఈ సమావేశాల ప్రారంభం రోజునే అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి... మైకును లాక్కొనేందుకు ప్రయత్నించారు. దీంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ సభ్యులపై ఒక రోజు వేటు వేశారు. అయితే, టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్‌పై మాత్రం ఈ సెషన్ మొత్తానికి వాయిదా వేశారు. 
 
ఇప్పటికే అధికార వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనగాని సత్య ప్రసాద్‌లను ఐదు రోజుల పాటు సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం... ఆ తర్వాత సభలో వీడియో తీస్తున్నారంటూ పయ్యావుల కేశవ్‌పై కూడా ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు, చంద్రబాబు నాయుడు అరెస్టుపై టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. 
 
ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంలో అద్దాలు, బాటిల్ పగులగొట్టారని, వారి తీరు క్రిమినల్స్‌ను తలపించేలా ఉందని చెప్పారు. ఇలాంటి సభా వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, బుచ్చయ చౌదరి, గద్దె రామ్మోహన్ రావు, చిన్నరాజప్ప సహా ఎమ్మల్యేలందరినీ ఒక్కరోజు సస్పెండ్ చేశారు.