ఎంత దారుణం.. అంధ ఉపాధ్యాయుడిన టీజ్ చేసిన విద్యార్థులు...
కేరళ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ అంధ ఉపాధ్యాయుడిని కొందరు విద్యార్థులు టీజ్ చేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని ఎర్నాకుళంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగు రావడంతో స్కూలు యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీజ్ చేసిన విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఎర్నాకుళంలోని మహారాజా ప్రభుత్వ పాఠశాలలో బాధిత అధ్యాపకుడు రాజనీతి శాస్త్రం బోధిస్తుంటారు. ఆయనకు చూపు లేదు. అదే కాలేజీలో చదువుకున్న ఆయన చివరకు అక్కడ ఉపాధ్యాయుడిగా ఎదిగారు. అయితే, ఇటీవల ఆయనకు తరగతి గదిలో దారుణ అనుభవం ఎదురైంది. పాఠం చెబుతుండగా ఆయనను కొందరు విద్యార్థులు చుట్టుముట్టి టీజ్ చేయడం ప్రారంభించారు.
కనీస మానవత్వం కూడా లేకుండా ఉపాధ్యాయుడికి చూపు లేదంటూ ఘోరంగా అవమానించారు. ఇది చాలదన్నట్టు ఈ దారుణ దృశ్యాల్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో, విద్యార్థులపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన స్కూల్ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో వారు ఈ ఘటనకు బాధ్యులైన ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు.
ఈ ఘటనపై బాధిత ఉపాధ్యాయుడు కూడా స్పందించారు. 'వారికి ఓ గంట సేపు క్లాస్ చెప్పేందుకు రెండు గంటలు పాటు సిద్ధమై వచ్చా. ఈ వీడియో నా స్నేహితులు, బంధువులను ఎంతో బాధించింది. అయితే, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ సమస్యను కళాశాల పరిధిలోనే పరిష్కరించుకుంటాం' అని అధ్యాపకుడు తన దొడ్డ మనసు చాటుకున్నారు.