వంటింటి వ్యాఖ్యలపై మహిళాలోకం ఆగ్రహం: కాళ్లబేరానికి వచ్చిన స్పీకర్ కోడెల
మహిళలు వంటింటికే పరిమితమైతే ఎలాంటి వేధింపులుండవు, బయటికొస్తేనే ఎక్కడలేని ప్రమాదాలు అంటూ ఘోరంగా వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మహిళా ప్రతినిధుల తీవ్రవిమర్శల దుమారంలో చిక్కుకుని కాళ్లబేరానికి వచ్చి క్షమాపణలు చెప్పారు.
మహిళలు వంటింటికే పరిమితమైతే ఎలాంటి వేధింపులుండవు, బయటికొస్తేనే ఎక్కడలేని ప్రమాదాలు అంటూ ఘోరంగా వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మహిళా ప్రతినిధుల తీవ్రవిమర్శల దుమారంలో చిక్కుకుని కాళ్లబేరానికి వచ్చి క్షమాపణలు చెప్పారు. ‘ఒక వాహనం కొని షెడ్‌లో ఉంచితే ప్రమాదాలు జరగవు. అదే వాహనాన్ని బయటకు తీసుకెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మహిళల పరిస్థితి కూడా అంతే.. వారు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవు..‘ అని బుధవారం విజయవాడ ‘మీట్ ది ప్రెస్’లో ఏపీ స్పీకర్ కోడెల వ్యాఖ్యానించడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. మొదట్లో తాను చాలా సాధారణంగా మాట్లాడానని సర్దుకోపోయిన కోడెల చివరకు క్షమాపణ చెప్పక తప్పింది కాదు.
మహిళా లోకానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు క్షమాపణలు చెప్పారు. మహిళలు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవన్న తన వ్యాఖ్య ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలన్నారు.
‘మహిళా సాధికారత–సవాళ్లు’ పేరిట గురువారం విజయవాడలోని ఎంబీభవన్‌లో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశం స్పీకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. సమావేశానికి హాజరైన మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య తదితరులు ఈ వ్యవహారం సహా రౌండ్‌టేబుల్‌లో ప్రస్తావనకొచ్చిన అంశాల్ని వెంటనే స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కోడెల... తానలా అనలేదని, ఎవరైనా అలా అర్థం చేసుకుని బాధపడి ఉంటే సారీ అని అన్నట్టు మహిళాసంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు చెప్పారు.
ఉద్యోగాలు చేస్తున్న, ఇల్లుదాటి బయటకికొచ్చిన మహిళలు వారిపై వేధింపులను ఎదుర్కోవలసిందంటూనే ఇంట్లో ఉంటేనే వారికి భద్రత ఉంటుందని చెప్పడం మహిళలకు షాక్ కలిగించింది. రాజకీయ నేతలు చివరకు స్పీకర్లు సైతం తమలో గూడుకట్టుకుని ఉన్న ఫ్యూడల్ భావాలను ఇలా వ్యక్తీకరించడం, తర్వాత సర్దుకోవడం పరిపాటిగా మారింది.