శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 జులై 2021 (13:50 IST)

బీజేపీ సీనియర్ నేత చిలకం రామచంద్రారెడ్డి ఇకలేరు...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా పని చేసిన చిలకం రామచంద్రారెడ్డి ఇకలేరు. ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. 
 
 
అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
 
చిలకం రామచంద్రారెడ్డి రాయలసీమకు తాగు, సాగునీటి కోసం గతంలో పాదయాత్ర చేపట్టారు. దుర్భిక్ష ప్రాంతం రాయలసీమకు ప్రాజెక్టుల అవసరం ఎంతుందో నాడే ఆయన ఎత్తిచూపారు. 
 
ఫ్యాక్షన్ కక్షల ఆలవాలమైన రాయలసీమలో తుపాకుల లైసెన్సులు రద్దు చేయాలంటూ ఉద్యమం చేపట్టిన చరిత్ర చిలకం రామచంద్రారెడ్డి సొంతం. అప్పట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా, సొంత సామాజిక వర్గం కంటే సామాన్యులే ముఖ్యమని ఉద్యమం కొనసాగించారు. 
 
ఫ్యాక్షన్ అంతానికి తన శక్తిమేర కృషి చేశారు. రామచంద్రారెడ్డి మృతి పట్ల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలియజేశారు. రామచంద్రారెడ్డి సిద్ధాంతాలకు కట్టుబడిన నాయకుడు అని కొనియాడారు. 
 
రామచంద్రారెడ్డి తన పట్ల ఎంతో ఆప్యాయత చూపేవారని గుర్తుచేసుకున్నారు. ఆయనతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నానని వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఈ విషాద సమయంలో రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే, ఏపీ శాఖ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా సంతాపం తెలిపారు.