సీఎం సలహాదారుగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రతినిధి
సమయానుకూలంగా రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిట్ట. ఆయన తన సచివాలయ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులను సమన్వయం చేయడానికి మంచి ఎంపికనే చేసుకున్నారు. ఏపీ ఎన్జీవోల సంఘం ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా నియమిస్తూ, ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ మేటర్స్ పై ప్రబుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఆయనను ఎంపిక చేశారు. ఈ మేరకు సీఎం అడిషనల్ సెక్రటరీ ధనుంజయ్ రెడ్డి సోమవారం రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ పే రివిజన్ కోసం, ఫిట్ మెంట్, ఎరియర్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసనలు తెలుపుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆడిన మాట తప్పుతున్నారని అసమ్మతి రాగాలు తీస్తున్నారు. మరో పక్క సచివాలయ ఉద్యోగుల్లోనూ నిరసన వ్యక్తం అవుతోంది. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక, వారిలోనూ నిరసలు ప్రారంభం అయ్యాయి. దశలో వారందరినీ సమన్వయపరచి ప్రబుత్వానికి సలహాలు ఇవ్వడానికి ఏపీ ఎన్జీవోల సంఘం ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డిని ఎంపిక చేసింది.
దీని వల్ల సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తగ్గి, ఉద్యోగులను సమన్వయ పరిచే బాధ్యత ఏపీ ఎన్జీవో నాయకుడి భుజస్కందాలపైనే పెట్టినట్లు అవుతుంది. ఇది ఎంత మేరకు ప్రభుత్వోద్యోగుల్లో నిరసనలను చల్లారుస్తుందో వేచి చూడాలి.