బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (15:01 IST)

సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముందని అనుకోవద్దు : ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు

cmbabu
ఏపీలోని ఏన్డీయే కూటమి ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ హెచ్చరిక చేశారు. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముందని అనుకోవద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రతి ఒక్క సభ్యుడు ఏం మాట్లాడుతున్నారన్న విషయాన్ని  నిశితంగా గమనించాలని ఆయన సూచించారు. 
 
అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. పార్లమెంట్‌ రీసెర్చ్‌ స్టడీస్‌ సభ్యులు బడ్జెట్‌పై వారికి అవగాహన కల్పించారు. సదస్సులో భాగంగా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలని సూచించారు. రాష్ట్రంతోపాటు కేంద్ర బడ్జెట్‌లోనూ నిధుల కేటాయింపులపై ఎమ్మెల్యేలు స్టడీ చేయాలని కోరారు. పని చేయాలనే ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని తెలిపారు. 
 
ముఖ్యంగా, 'సభలో ప్రతిపక్షం లేదు కదా.. మనకేముందని అనుకోవద్దు. వాళ్లకు బాధ్యత లేదు.. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం. ప్రజలకు ఏం అవసరమో.. మనం చేసింది చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక లాంటిది. అసెంబ్లీలో తమ ప్రతినిధి ఏం మాట్లాడుతున్నారని ప్రజలు గమనిస్తూనే ఉంటారు. బూతులు మాట్లాడితే ప్రజలు స్వాగతించరు.. గతంలో ఇదే జరిగిందని హెచ్చరించారు. 
 
బడ్జెట్‌ సమావేశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ప్రభుత్వం తెచ్చే పాలసీలు, బిల్లులపై శాసనసభ్యులు తప్పకుండా అధ్యయనం చేయాలి. పబ్లిక్‌ గవర్నెన్స్‌లో ఎమ్మెల్యేలనూ భాగస్వాములను చేస్తాం. విజన్‌-2047పై అందరి అభిప్రాయాలు తెలియజేయాలి' అని సీఎం సూచించారు.