ఏపీలో ముందస్తు ఎన్నికలు! సీఎం జగన్ భారీ ప్రణాళిక!!
ఏపీలో భారీ రాజకీయ సమీకరణాలు చోటు చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే 28 నెలల పాలన పూర్తి చేసారు. మరో 30 నెలల పాలన కొనసాగాల్సి ఉంది. అయితే, సీఎం జగన్ ఈ 30 నెలలతో పాటుగా మరో 60 నెలల పాటు కూడా తానే సీఎంగా కొనసాగేందుకు భారీ వ్యూహాలు సిద్దం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా కొత్త స్కెచ్ తో ముందుకు కదులుతున్నట్లుగా కనిపిస్తోంది.
ప్రధానంగా పాలనాపరంగా తన వ్యక్తిగత ఇమేజ్ ను జగన్ ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చారు. కొందరు మంత్రులు - ఎమ్మెల్యేల పని తీరు పైన మాత్రం సీఎం సంతృప్తిగా లేరని తెలుస్తోంది. ప్రజల ఫీడ్ బ్యాక్ ఆధారంగా కఠిన నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. అందులో ముందుగా మంత్రుల పని తీరు ఆధారంగా కేబినెట్ ప్రక్షాళన జరగటం ఖాయంగా కనిపిస్తోంది. మంత్రులను మార్చి...సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచన లో సీఎం ఉన్నారని సమాచారం. అదే సమయంలో పార్టీ కోసం తొలి నుంచి పని చేస్తూ..మంత్రి పదవులు దక్కని వారికి ఈ సారి కేబినెట్ లో స్థానం కల్పించనున్నారు.
మంత్రులను పక్కన పెట్టటంలో, కొత్త వారికి అవకాశం ఇవ్వటంలో ఎటువంటి మొహమాటాలకు అవకాశం ఉండదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. త్వరలో ఏర్పాటు చేసే కేబినెట్ పూర్తిగా ఎన్నికల కేబినెట్ గా ఉండనుందని తెలుస్తోంది. ఇక, వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగుతుందని స్వయంగా సీఎం తన సహచర మంత్రులకు చెప్పారు. దీని ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం జగన్ ముందుగానే రంగంలోకి దిగుతున్నారనేది స్పష్టం అవుతోంది. ఇక, 2019 ఎన్నికల సమయంలో క్షేత్ర స్థాయిలో అభ్యర్ధుల ఎంపిక..సర్వేలు..రాజకీయ వ్యూహాలు అందించటంలో ప్రశాంత్ కిషోర్ అండ్ టీం జగన్ కు సహకరించింది.
తిరిగి అధికారం దక్కుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నా, ఎక్కడా పొరపాట్లకు అవకాశం లేకుండా ముందస్తుగానే ప్రశాంత్ కిషోర్ టీం సేవలు వినియోగించుకోవాలని సీఎం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆ టీం రంగ ప్రవేశం చేసిన తరువాత, వారిచ్చే నివేదికలను పరిగణలోకి తీసుకుంటూ, రాష్ట్రంలో పాలన పైన సీఎం పర్యటనలు చేస్తూ, అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నట్లుగా సమాచారం. తాను ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసానని..మిగిలిన కొద్ది మొత్తంలో మిగిలినవి సైతం సీఎం జగన్ పూర్తి చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. కరోనా సమయంలోనూ ఆర్దికంగా కష్టాలు ఉన్నా..పధకాలు అమలు చేయటం ద్వారా లబ్దిదారుల్లో మంచి ఇమేజ్ పెరిగిందనే అంచనాలో వైసీపీ నేతలు ఉన్నారు.
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాజకీయంగా బలహీనంగా ఉందనేది వైసీపీ నేతల అంచనా. దీంతో..టీడీపీ తిరిగి కోలుకోకముందే...ముందస్తు ఎన్నికలకు వెళ్లే అంశం సైతం సీఎం ఆలోచన చేస్తున్నారంటూ వైసీపీలో చర్చ సాగుతోంది. కేంద్రం జమిలీ ఎన్నికల ఆలోచన సైతం దీనికి కారణంగా కనిపిస్తోంది. 2024 తొలి మూడు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2019 లో జరగాల్సిన ఎన్నికలను ముందుగానేు 2018 లో వెళ్లటం ద్వారా ప్రతిపక్షాలకు కోలుకొనే అవకాశం లేకుండా చేసారు. ఏపీలోనూ ఇదే ఫార్ములా అనుసరించే అవకాశం కనిపిస్తోంది.
ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరో సారి అధికారం దక్కించుకుంటే, ఇక, ఏపీలో టీడీపీ పూర్తిగా దెబ్బ తింటుందని వైసీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. కేంద్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను సీఎం జగన్ నిశితంగా గమనిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా..ఆయన ఏర్పాటు చేసిన ఐ ప్యాక్ టీం సభ్యులు వారి ప్రొఫెషన్ లో భాగంగా వైసీపీ కోసం పని చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్రంలోనూ 2024 లో పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఆ సమయంలోగానే ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేసుకొని, తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత లోక్ సభ ఎన్నికల్లొ ఎంపీ సీట్ల పైన ఫోకస్ పెట్టాలనేది వైసీపీ ముఖ్య నేతల ఆలోచనగా చెబుతున్నారు. ఎలాగైనా అధికారం తిరిగి దక్కించుకోవటం ద్వారా రాష్ట్రంలో ఇక వైసీపీ బలమైన ప్రత్యామ్నాయం లేని పార్టీగా ఎదుగుతుందనే నమ్మకం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అందులో భాగంగానే వచ్చే నెల అక్టోబర్ 2 నుంచి సీఎం జగన్ రచ్చబండ మొదలు పెడుతున్నారు. సాధ్యమైనంత వరకు ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్నారు.