ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (12:49 IST)

ఓట‌మి భ‌యంతో జగన్ రెడ్డి నిద్రలేని రాత్రులు...

వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేక. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ‎నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని  టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర టీడీపీ ఇంచార్జి బుద్దా వెంకన్న అన్నారు.

శుక్రవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కేబినెట్ లో పీకే టీం గురించి, ఎన్నికల్లో పార్టీ గెలపోటముల గురించి చర్చించటం సిగ్గుచేట‌న్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో పీకే టీంను రంగంలోకి దించేందుకు జగన్ సిద్దమయ్యారు. పీకే కాదు..పైనున్న జగన్ రెడ్డి తాత రాజారెడ్డి దిగొచ్చినా 2024లో వైసీపీ ఓటమిని, టీడీపీ గెలుపును అడ్డుకోలేరు. టీడీపీకి పీకేలు అవసరం లేదు, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఫోటో పెట్టుకుంటే చాలు టీడీపీ అభ్యర్ధులంతా గెలుస్తారు. ఎవరినైనా ఒకసారే మోసం చేస్తారు? మీ మాయ మాటలు నమ్మి మరో సారి మోసపోయేందుకు రాష్ట్ర ప్రజలు సిద్దంగా లేరు. గత ఎన్నికల్లో టీడీపీపై, చంద్రబాబుపై పీకే, వైసీపీ నేతలు చేసిన అబద్దపు ప్రచారాల్ని తిప్పికొట్టడటంలో మేం విఫలమయ్యాం. కానీ‎ ఈసారి పీకే ఎన్ని అబద్దపు ప్రచారాలు చేసినా తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉన్నాం అని బుద్ధా వెంక‌న్న చెప్పారు.
 
అబద్దపు హామీలతో ఒక్క చాన్స్ అని చెప్పి.... అధికారంలోకి వచ్చిన జగన్   రాష్ట్రాన్ని బీహార్ కంటే వెనకబడేలా చేశారు. నవరత్నాలు అని చెప్పి ప్రజలను నవ మోసాలు చేసిన ఘనుడు జగన్ రెడ్డి, రెండున్నరేళ్ల పాలనలో  విద్యార్దుల నుంచి నిరుద్యోగులు, రైతులు, మహిళలు అన్ని వర్గాలను మోసం చేశారు. అయ్యో  ఆకలి అనే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇక మిగిలిన రెండున్నరేళ్లలో ఎడారిగా మారటం ఖాయం. ఇసుక కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు  ఉపాధి లేకుండా చేశారు. వీరికి ఉపాధి దొరికితే ఒక్కో కుటుంబానికి .సంవత్సారానికి  లక్షలు రూపాయలు వస్తాయి. కానీ సంక్షేమ పధకాల పేరుతో మీరిచ్చే రూ. ‎10 వేలు, 15 వేలు వారికి సరిపోతాయా? ఫించన్  రూ. 3 వేలకు  పెంచుతామని కేవలం రూ.,250 పెంచారు, రేషన్ కార్డు కే ఒకటే పించన్ అంటూ ఉన్న పించన్లు తీసేస్తున్నారు.  దీనిపై పీకే ఏం ప్రచారం చేస్తారు? అని వెంక‌న్న ప్ర‌శ్నించారు.
 
జగన్ పాదయాత్ర ముగిసి కొండమీదకు వెళ్లినపుడు మెట్లపై ఆయనతో పాటు ఎవరు కూర్చున్నారు? వారికే మేం కులాలు ఆపాదించామా? ఎవరూ బాదపడకూడన్నది చంద్రబాబుది మనస్తత్వం, చంద్రబాబు మంచితనం మీద జగన్ రెడ్డి దెబ్బకొట్టారు.  రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మాకు డబ్బులు వద్దు, ఈసారి పీకే అబద్దపు ప్రచారాలకు, వైసీపీ మోసపు మాటలకు మోసపోమని ప్రజలు చెబుతున్నారు.  పీకే వచ్చినా జగన్ తాత రాజారెడ్డి దిగొచ్చినా వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జెండా ఎగరటం ఖాయమని బుద్దా వెంకన్న అన్నారు.