గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (09:03 IST)

కరోనాకు బూస్టర్ డోస్ లేనట్టే : కేంద్రం

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. వీరిలో ఇప్పటికే అనేక మంది రెండు డోసుల టీకాలు వేశారు. ఇలాంటి వారు మరో నెల రోజుల్లో బూస్టర్ డోస్ వేసుకోవాలంటూ ప్రచారం సాగుతోంది. 
 
దీనిపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా స్పష్టతనిచ్చింది. భారత్‌లో ప్రజలకు బూస్టర్ డోస్ ఇచ్చే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు ఆరోగ్యశాఖ బదులిచ్చింది. ప్రస్తుతానికైతే శాస్త్రవేత్తలు కానీ, ప్రజారోగ్య విభాగంలో కానీ ఈ అంశంపై ఎటువంటి చర్చా జరగడం లేదని స్పష్టం చేసింది. అలాగే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఇప్పుడే బూస్టర్ డోస్ అవసరం లేదని స్పష్టం చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ ఈ విధంగా సమాధానమిచ్చారు. ‘‘శాస్త్రీయంగా కానీ, ప్రజారోగ్య విభాగంలో కానీ ప్రస్తుతం బూస్టర్ డోస్ ప్రధానమైన చర్చనీయాంశం కాదు. రెండు డోసులు అందరికీ అందేలా చూడటమే ప్రధాన లక్ష్యం’’ అని ఆయన తెలిపారు.
 
ఇప్పటి వరకూ దేశ జనాభాలోని 20 శాతం వయోజనులకు రెండు డోసుల వ్యాక్సిన్ అందినట్లు భార్గవ వెల్లడించారు. ఆరోగ్య సిబ్బందిలో 99 శాతం కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని, అర్హులైన 82 శాతం మంది రెండో డోసు కూడా అందుకున్నారని చెప్పారు.
 
ఫ్రంట్ లైన్ వర్కర్లలో 100 శాతం మందికి తొలి డోస్ అందినట్లు తెలిపారు. 78 శాతం మంది రెండో డోసు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, గోవా, చండీగఢ్, లక్షద్వీప్‌లోని వయోజనులందరూ కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు