బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (07:28 IST)

కరోనా వ్యాక్సినేషన్‌లో తెలంగాణా సరికొత్త రికార్డు

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను అన్ని రాష్ట్రాలు ముమ్మరం చేశాయి. ఇందులోభాగంగా, మెగా క్యాంపులు నిర్వహిస్తూ కరోనా టీకాలను వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఒకే రోజు ఏకంగా 4 లక్షల మందికి కొవిడ్‌ టీకాలు వేసింది. తద్వారా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ రికార్డు సృష్టించింది. 
 
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ వీలైనంత త్వరగా టీకా అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వైద్య ఆరోగ్యశాఖ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వ్యాక్సిన్‌ డ్రైవ్‌ని నిర్వహించింది. తొలి రోజే 4,01,606 మందికి టీకాలు పంపిణీ చేసినట్టు డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. 
 
అందులో 2,69,067 మందికి తొలి డోస్‌, 1,32,539 మందికి రెండో డోస్‌ టీకా అందించినట్టు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ పూర్తి చేసిన ఆరోగ్యశాఖ .. ఈనెలాఖరు నాటికి మరో కోటి డోసులు పంపిణీ చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు డీహెచ్‌ వివరించారు.
 
మరోవైపు, తక్కువ వ్యవధిలోనే టీఎస్ ఆర్టీసీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. సంస్థలో పనిచేస్తున్న సమస్త ఉద్యోగులు, కార్మికులందరికీ రెండు డోసులను అందించినట్టు అధికారులు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అన్ని రీజియన్‌లలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి స్వల్ప వ్యవధిలోనే లక్ష్యాన్ని అధిగమించి 100 శాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.