గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జులై 2024 (16:44 IST)

విధుల్లో బిజీబిజీగా పవన్ కళ్యాణ్ .. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలిస్తున్నారు.

pawan kalyan
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన విధుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. వివిధ శాఖా బాధ్యతలను నిర్వహిస్తున్న ఆయన అన్ని శాఖలపై పట్టు సాధించేందుకు నిరంతరం ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో నిరంతరం సమీక్ష చేస్తున్నారు. ఇందులోభాగంగా, శనివారం ఉదయం నుంచీ ఉప ముఖ్యమంత్రి తన కార్యాలయ సిబ్బందితో కలసి ప్రతి అర్జీని చదువుతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతోపాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను, ఎదురవుతున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతోపాటు, సమస్య తీవ్రతనుబట్టి అధికారులతో మాట్లాడుతున్నారు. 
 
తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ, 6వ వార్డు, ఫస్ట్ లేన్ నుంచి మహిళలు, వృద్ధులు తెలియచేసిన సమస్య పవన్ కళ్యాణ్‌ని కదిలించింది. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్‌పై ప్రమాదకరంగా, వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థినులను, యువతులను, మహిళలను వేధిస్తున్నారని... వృద్ధులను భయపెడుతున్నారని లేఖ రాశారు. అదేవిధంగా యువతుల ఫోటోలు తీసి ఇంటర్నెట్‌‌లో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలుపెట్టడం, ఇళ్లపై రాళ్ళు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. సదరు యువకులు వివరాలు, బైక్స్‌పై వేగంగా సంచరిస్తున్న ఫోటోలను, వాహనాల నంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు. ఆ యువకులను పట్టుకొని హెచ్చరిస్తే ప్రధాన రహదారికి వస్తే దాడి చేస్తామని బెదిరించారని తెలిపారు. ఆ యువకులు ఒక మహిళా ఎస్సైను సైతం వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  
 
పవన్ కళ్యాణ్ ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించి తిరుపతి ఎస్.పి.సుబ్బరాయుడుతో మాట్లాడారు. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలి అన్నారు. ఆడ పిల్లలను, మహిళలను వేధించేవారిపై కఠినంగా వ్యవహరించాలి అని స్పష్టం చేశారు. ఈ సమస్యపై వెంటనే దృష్టి సారిస్తామని తగు చర్యలు తీసుకొంటామని తిరుపతి ఎస్పీ హామీ ఇచ్చారు.