అమరావతిలో సమాంతర రహదారులు.. తొమ్మిది హబ్‌ల అనుసంధానం
నూతన రాష్ట్రా రాజధాని అమరావతిని ప్రపంచంలోని ఉన్నత నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది. చాలా కాలంగా సింగపూర్ బృందంతో కసరత్తు చేస్తోంది. నగరంలో రహదారులు, కాలువల వ్యవస్థ గ్రిడ్‌ల రూపంలో ఎలా ఉండాలనే అంశం దీర్ఘ కాలం కసరత్తు చేశారు. చివరకు ఓ నిర్ణయానికి వచ్చారు. సమాంతర రోడ్లు, హబ్బుల అనుసంధానం వంటి ప్రణాళికతో తుది రూపును సిద్ధం చేశారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రాజధానిలో రహదారులు వంపులు లేకుండా, ఒకదానికి ఒకటి సమాంతరంగా రోడ్లను సిద్ధం చేశారు. గ్రామ కంఠాలకు ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో తప్పనిసరై 'వీ' ఆకారంలో రోడ్లను మలుపు తిప్పారు. పాలవాగు, కొండవీటివాగులను కృష్ణా నదితో అనుసంధానిస్తూ కాలువల గ్రిడ్‌ను ప్రభుత్వం రూపొందించింది. రోడ్లు, కాలువల గ్రిడ్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు.
అమరావతి నగరంలో రోడ్లన్నీ సమాంతరంగా ఉంటాయి. ప్రధాన రహదారుల పొడవు 314 కి.మీ ఉంటుంది. ఇలా రాజధానిలో 1X1 కిలోమీటర్ల బ్లాకులుగా రోడ్లను 121 గదులు రానున్నాయి. రోడ్లను 'వీ' ఆకారంలో మలుపు తిప్పిన చోట 1X2 కి.మీ. రహదారి వస్తోంది. ఎక్స్‌ప్రెస్ రోడ్లు రెండు మాత్రమే కొంత వంపు తిరిగాయి.
గ్రిడ్‌లో భాగంగా ప్రభుత్వం, పర్యాటకం, వైద్య-ఆరోగ్యం, న్యాయస్థానాలు, విద్య, క్రీడలు, వాణిజ్యం సహా తొమ్మిది అంశాలకు ఉద్దేశించిన తొమ్మిది ప్రాంతాలను కలుపుతూ సువిశాల రహదారులు నిర్మితమవుతాయి. కృష్ణా నదికి సమాంతరంగా పాలవాగు, కొండవీటి వాగులు ఉన్నాయి. వీటిని కలుపుతూ అడ్డంగా ఆరు కాలువలు వస్తాయి.
ఇలా తొమ్మిది గ్రిడ్లను అనుసంధానం చేస్తూ వచ్చిన ప్రణాళికను సిద్ధం చేశారు. వాటిని ఇది ప్రపంచంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడేలా తయారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.