గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

వాలంటీర్లకు షాక్ : సాక్షి పత్రిక కొనుగోలు అలవెన్స్‌ను రద్దు చేసిన ఏపీ సర్కారు!

గత వైకాపా ప్రభుత్వం వాలంటీర్లు విధిగా సాక్షి దినపత్రికను కొనుగోలు చేయాలన్న నిబంధనతో ఇందుకోసం నెలకు రూ.200 చొప్పున అలవెన్స్ ఇచ్చేలా జారీ చేసిన జీవోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేసింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక కావడంతో, నాటి ప్రభుత్వ అధికారులు కూడా సీఎం జగన్, ఆయన సతీమణి భారతీ రెడ్డిల మెప్పు కోసం ఈ అడ్డగోలు నిర్ణయం తీసుకుని, ప్రతి నెల వాలంటీర్లకు రూ.200 చొప్పున అలవెన్సులు చెల్లిస్తూ వచ్చారు. 
 
అయితే ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకావడంతో ఆ అలవెన్సును రద్దు చేసింది. పత్రిక కొనుగోలు ఉత్తర్వులను రద్దు చేస్తూ తాజాగా మెమో జారీ చేసింది. పత్రిక కోసం ఎలాంటి చెల్లింపులు జరపవద్దని ఆదేశించింది. సాక్షి పత్రిక సర్క్యులేష్‌ను పెంచుకునేందుకు అప్పట్లో వైకాపా పాలకుల ఆదేశాలను అధికారులు శిరసావహించారు. ఇపుడు ప్రభుత్వం మారడంతో ఆ ఉత్తర్వులు రద్దు చేశారు. 
 
మరోవైపు, ఏపీలో వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎన్నికల ముందు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ పెద్ద సంఖ్యలో వాలంటీర్లు టీడీపీ నేతలను కలిసి మొరపెట్టుకుంటున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. కొందరు వాలంటీర్లు వైకాపా నేతలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.