1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 మే 2024 (13:02 IST)

జనసేన కార్పొరేటర్‌పై చట్టప్రకారం క్రిమినల్ చర్యలు : ఏపీ సీస్ జవహర్ చర్యలు

jawahar reddy
తాను భూ అక్రమాలకు పాల్పడినట్టు జనసేన పార్టీ కార్పొరేటర్ చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోవడంతో లేకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సివుందని ఆయన హెచ్చరించారు. ఇటీవల ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి విశాఖ ప్రాంతంలో పర్యటించడం తెలిసిందే. అయితే పర్యటన వివాదాస్పదమైంది. సీఎస్ జవహర్ రెడ్డి విశాఖలో భూఅక్రమాలకు పాల్పడుతున్నారంటూ జనసేన నేత, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
 
మరి కొన్నిరోజుల్లో సీఎస్ పదవీ విరమణ చేయనున్నారని, ఆయన విశాఖ, విజయనగరం జిల్లాల్లో రూ.2 వేల కోట్ల విలువైన అసైన్డ్ భూములను చేజిక్కించుకున్నారని పీతల మూర్తి పేర్కొన్నారు. సీఎస్‌గా జవహర్ రెడ్డి వచ్చాకే భూముల మార్పిడి జీవో.596 వచ్చిందని, ఆ జీవోతో సీఎస్ తనయుడు విశాఖ ప్రాంతంలో 800 ఎకరాల భూములు కొట్టేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకిరాదన్న భయంతోనే సీఎస్ హడావిడిగా రిజిస్ట్రేషన్లు కోసం విశాఖ వచ్చారని పీతల మూర్తి స్పష్టం చేశారు. కానీ భోగాపురం ఎయిర్ పోర్టుపై సమీక్ష అంటూ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు.
 
జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపణలపై సీఎస్ జవహర్ రెడ్డి స్పందించారు. అసైన్డ్ భూములు కొట్టేసినట్టు వస్తున్న ఆరోపణలను ఖండించారు. 'విశాఖ పరిసరాల్లో నేను, నా కుటుంబ సభ్యులు ఎలాంటి అసైన్డ్ భూములు కొనుగోలు చేయలేదు. పీతల మూర్తి యాదవ్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు విశాఖ వెళ్లాను. పనిలో పనిగా భోగాపురం ఎయిర్ పోర్టు పనులను కూడా పరిశీలించాను. అసైన్డ్ భూముల కోసమే విశాఖ వచ్చాననడం అర్థరహితం. నా కుమారుడు గత ఐదేళ్లలో విశాఖకు కానీ, ఉత్తరాంధ్రలో మరే జిల్లాకు కానీ వెళ్లలేదు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మీడియా ముందు క్షమాపణ చెప్పాలి. తన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలి. లేకపోతే చట్టప్రకారం క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.