గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 మే 2024 (12:32 IST)

పాకిస్థాన్ మంత్రికి తేరుకోలేని షాకిచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్!

arvind kejriwal
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ట్వీట్ చేసిన పాకిస్థాన్ ఎంపీ ఫవాద్ హుస్సేన్ చౌదరికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా కౌంటరిచ్చారు. మా దేశం గురించి మేం చూసుకుంటాం... కానీ ముందు అంతంత మాత్రంగానే ఉన్న మీ దేశం గురించి ఆలోచించుకోండి అంటూ చెప్పారు. అరవింద్ కేజీవాల్, ఆయన కుటుంబ సభ్యులు శనివారం ఢిల్లీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కేజ్రివాల్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
 
ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. "నా భార్య, తండ్రి, పిల్లలతో కలిసి ఓటు వేశాను. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. అందుకే ఆమె రాలేకపోయింది. నియంతృత్వం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా నేను ఓటు వేశాను. మరి మీరు కూడా వెళ్లి ఓటు వేయండి" అని ట్వీట్ చేశారు.
 
ఈ ట్వీట్‌ను ఫవాద్ చౌదరి రీట్వీట్ చేస్తూ... ద్వేషం, అతివాదభావజాలంపై శాంతి, సామరస్యం విజయం సాధించాలని కామెంట్ చేశారు. మోర్ పవర్, ఇండియా ఎలక్షన్ 2024 అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. పాక్ ఎంపీ ట్వీట్‌పై కేజీవాల్ తీవ్రంగా స్పందించారు.
 
'చౌదరీ సాబ్, నేను, మా దేశ ప్రజలం మా సమస్యలను పరిష్కరించుకోగలం. మీ జోక్యం ఇందులో అవసరం లేదు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో అత్యంత దారుణమైన పరిస్థితి నెలకొని ఉంది. మీరు మీ దేశం గురించి ఆలోచించుకోండి. భారతదేశంలో ఎన్నికలు మా అంతర్గత విషయం. ఇందులో ఉగ్రవాదానికి నిలయమైన మీ దేశ జోక్యాన్ని భారత్ సహించదు' అని కౌంటర్ ఇచ్చారు.