సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (09:32 IST)

రైల్వే జోన్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం స్థలం కేటాయించలేదు : రైల్వే మంత్రి అశ్విని

ashwini vaishnav
దక్షిణ కోస్తా పేరుతో ఏర్పాటు చేయాల్సిన రైల్వే జోన్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తగిన స్థలాన్ని కేటాయించలేదని కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో భాగంగా, టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా సమాధానమిచ్చారు. జోన్‌కు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్) పూర్తయిందని, 2023-24 సంవత్సరానికి కూడా రూ.10 కోట్లు కేటాయించినట్టు ఆయన వెల్లడించారు. కానీ, ఏపీ ప్రభుత్వం స్థలం కేటాయిచలేదని చెప్పారు. 
 
"దక్షిణకోస్తా రైల్వే జోన్‌కు సంబంధించిన డీపీఆర్ తయారైంది. రూ.106.89 కోట్ల అంచనా వ్యయంతో ఈ జోనల్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులను మూజురు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం రూ.10 కోట్లు కేటాయించారు. భూసర్వే, జోన్ ప్రధాన కార్యాలయ సముదాయం, రెసిడెన్షియల్ కాలనీ, ఇతర నిర్మాణాలకు అవసరమైన లే ఔట్ ప్లాన్ తయారీ బాధ్యతలను తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు అప్పగించాం. 
 
బస్ ర్యాపిడ్ సిస్టమ్ (బీఆర్టీఎస్) కోసం ఏపీ ప్రభుత్వం రైల్వే భూమి తీసుకున్నందు దానికి బదులుగా ముడసర్లోవలోని 52.2 ఎకరాల గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన భూమిని ఏపీ ప్రభుత్వం రైల్వే శాఖకు అప్పగించాల్సివుంది. ఇందుకు అనువైన భూమిని ప్రభుత్వం ఇంకా గుర్తించి, రైల్వే శాఖకు అప్పగించాల్సివుంది" అని అశ్విని వైష్ణవ్ తెలిపారు. వైజాగ్ జంక్షన్ - గోపాలపట్నం మధ్య 15.31 కిలోమీటర్ల మేర రూ.159.47 కోట్లతో రూ.3, 4 లైన్ల నిర్మాణం కోసం 2023 ఏప్రిల్ నెలలో అనుమతులు మంజూరు చేసినట్టు మంత్రి మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.