ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 7 డిశెంబరు 2016 (19:03 IST)

విమానాశ్రయాల అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం దృష్టి

మౌలిక వసతుల కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. రాష్ట్రం పారిశ్రామికంగా, సాంకేతికంగా, విద్య, వైద్య పరంగా అభివృద్ధి చెందాలంటే విమాన సర్వీసులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. పర్యాటక రంగం అభివృద్ధికి కూడా ఇది దోహద

మౌలిక వసతుల కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. రాష్ట్రం పారిశ్రామికంగా, సాంకేతికంగా, విద్య, వైద్య పరంగా అభివృద్ధి చెందాలంటే విమాన సర్వీసులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. పర్యాటక రంగం అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని విమానయాన హబ్‌గా రూపొందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. నూతన రాజధాని అమరావతికి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తారు. ఇక్కడ నుంచి దేశంలోని అన్ని నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఈ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ఈ నెలాఖరికి అందుబాటులోకి వస్తుంది. ఈ టెర్మినల్ పూర్తి అయితే దీనికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా లభించే అవకాశం ఉంటుంది. గన్నవరం - విశాఖపట్నం, గన్నవరం - హైదరాబాద్, గన్నవరం - తిరుపతి, గన్నవరం - కడప మధ్య సర్వీసులు పెంచే ఆలోచన కూడా ఉంది.
 
రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖపట్నం (డొమెస్టిక్, కస్టమ్స్ రెండు విమానాశ్రయాలు), రాజమండ్రి, గ్ననవరం (విజయవాడ), తిరుపతి, కడప, పుట్టపర్తి విమానాశ్రయాల ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి విమాన సర్వీసులున్నాయి. పుట్టపర్తిలోని విమానాశ్రయం ప్రైవేటుది కాగా, విశాఖలోని కస్టమ్స్ విమానాశ్రయం ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో ఉంటుంది. మిగిలినవాటిని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది.
 
ప్రకాశం జిల్లా దొనకొండలోని విమానాశ్రయం పనిచేయడంలేదు. గుంటూరు జిల్లా విజయపురిలో నాగార్జున సాగర్ వద్ద ఒక ప్రైవేటు విమానాశ్రయం ఉంది. రాష్ట్రంలో విశాఖపట్నందే అతి పెద్ద విమానాశ్రయం.  తిరుమలకు దేశవిదేశీ భక్తుల తాకిడి ఎక్కువ. అందువల్ల తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతారు.  విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా  అభివృద్ధి చేస్తారు. రాజమండ్రిలోని మధురపూడి  విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుగోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రన్ వేని విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకోసం  850 ఎకరాలు సేకరించి, ప్రస్తుతం ఉన్న 1750 మీటర్ల  రన్ వేను 3,165 మీటర్ల కు పొడిగిస్తున్నారు.  రూ.181 కోట్ల ఖర్చుతో ఈ రన్ వే విస్తరణ పనులు జరుగుతున్నాయి. 2018 ఏప్రిల్ నాటికి అంతర్జాతీయ స్థాయిలో ఈ విస్తరణ పనులు పూర్తి చేస్తారు. 
 
విమానాశ్రయాల మధ్య ప్రాంతీయ అనుసంధానం
రాష్ట్రంలోని విమానాశ్రయాలను ప్రాంతీయంగా అనుసంధానం చేస్తారు. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ ఆధారిటీ - పౌర విమానయాన శాఖ - ప్రభుత్వాల మధ్య ఒప్పందం కూడా జరిగింది.  ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో విమానాశ్రయాల మధ్య తక్కువ ఛార్జీలతో ప్రాంతీయ పౌర విమాన సర్వీసులు పెరుగుతాయి. విశాఖ – గన్నవరం - తిరుపతి విమానాశ్రయాల మధ్య సర్వీసులు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
కొత్త విమానాశ్రయాల నిర్మాణం
విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డు విమానాశ్రయం, విశాఖ-చెన్నయ్ పారిశ్రామిక కారిడార్లో నెల్లూరు జిల్లా దగదుర్తి విమానాశ్రయం, కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను కొత్తగా నిర్మిస్తారు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దేశవిదేశీ వ్యాపారులు, అధికారులు, పర్యాటకులకు గన్నవరం విమానాశ్రయం ఒక్కటే సరిపోదన్న ఆలోచనతో దీనిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 వేల ఎకరాలలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం(పీపీపీ)తో అంతర్జాతీయ స్థాయిలో దీనిని నిర్మిస్తారు. సింగపూర్ సంస్థ రూపొందించిన నూతన రాజధాని ముసాయిదా ప్రణాళికలో కూడా దీనిని పేర్కొన్నారు. అయితే దీనికి ఇంకా స్థల నిర్ణయం జరుగలేదు. భోగాపురం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ  గ్రీన్‌ఫీల్డు విమానాశ్రయంగా నిర్మించేందుకు కేంద్ర విమానయాన శాఖ అంగీకారం తెలిపింది. కర్నూలు జిల్లా శ్రీశైలం, గుంటూరు జిల్లా నాగార్జున సాగర్, ప్రకాశం జిల్లా దొనకొండలలో ప్రాంతీయ విమానాశ్రయాలు నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 
 
గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం
అత్యంత ఆధునిక సౌకర్యాలు, అన్ని హంగులతో తీర్చిదిద్దేటటువంటి దానిని గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం అంటారు. వీటి నిర్మాణానికి కేంద్ర విమానయాన శాఖ ఒక పాలసీని రూపొందించింది. గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం పూర్తిగా పీపీపీ విధానంలోనే చేపట్టాలి. ఈ విమానాశ్రయానికి అవసరమైన భూమిని ప్రభుత్వమే సమకూరుస్తుంది. అవసరాన్నిబట్టి ప్రభుత్వం 20 శాతం వరకు పెట్టుబడి నిధులను సమకూర్చుతుంది. అయితే గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని నిర్మించవలసిన అవసరం ఏర్పడితే, ముందుగా స్టీరింగ్‌ కమిటీ దాని ఆవశ్యకతను పరిశీలిస్తుంది. కేంద్రానికి నివేదిక అందజేస్తుంది. కేంద్రం పూర్తిగా సంతృప్తి చెందిన తరువాతే డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అనుమతిస్తుంది. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మాణానికి ఈ తతంగం అంతా పూర్తి అయిన తరువాతే అనుమతించారు.
 
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి కోసం ఎయిర్ పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానికంగా విమానాశ్రయాల అభివృద్ధి, వాటిమధ్య అనుసంధానత, దేశీయ సర్వీసులు పెంచేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. ఈ ఎయిర్‌పోర్ట్ అథారిటీని పర్యాటక శాఖతో అనుసంధానం చేస్తారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఇది దోహదపడుతుంది.
 
విమాన సంస్థల కొత్త ప్యాకేజీలు
విమాన ప్రయాణికులను ఆకర్షించే విధంగా విమానయాన సంస్థలు కొత్త కొత్త ప్యాకేజీలను రూపొందిస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరాలను కలుపుతూ ‘టెంపుల్ టూరిజం’, సముద్రతీర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ‘బీచ్ టూరిజం’ అని వివిధ ప్యాకేజీలను రూపొందించనున్నారు. ఉదాహరణకు విశాఖపట్నం జిల్లాలో విశాఖ - అరకు - పాడేరు - అనంతగిరి, తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి - అఖండ గోదావరి - కోనసీమ - అంతర్వేది - పాపికొండలు ప్రత్యేక ఆకర్షణ గల ప్రధాన పర్యాటక కేంద్రాలు. ఈ ప్రాంతాలను పర్యటించడానికి ప్యాకేజీలు రూపొందిస్తారు. విమానాశ్రయాలకు సమీపంలో ఉండే పర్యాటక ప్రదేశాలకు వెళ్లడానికి ‘హెలీ టూరిజం’ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో అటు దేశవిదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. విమానయాన సంస్థలకు ఆదాయం కూడా పెరుగుతుంది. విమాన చార్జీలు సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకటించింది. ఈ పథకం ప్రకారం గంటలోపు విమాన ప్రయాణ టిక్కెట్ ధర రూ.2500 ఉంటుంది.
 
విమానాశ్రయాలకు తక్కువ చార్జీలతో వాహన సౌకర్యం
అన్నిచోట్ల పట్టణాలకు విమానాశ్రయాలు దూరంగానే ఉన్నాయి. రవాణా సౌకర్యం తక్కువగా ఉంటుంది. అక్కడకు వెళ్లాలంటే చార్జీలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటి దృష్ట్యా కూడా ప్రజలు విమానంలో ప్రయాణించడానికి అంతగా ఆసక్తి చూపడంలేదు. వీటిని దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయాలకు సమీప పట్టణాల నుంచి అందుబాటులో ఉండే చార్జీలతో వాహన సౌకర్యం కల్పించే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తోంది.