మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 జులై 2021 (14:33 IST)

ఏలూరు మున్సిప‌ల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు లైన్ క్లియర్

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఈ నెల 25వ తేదీన ఓట్లు లెక్కించాలని అధికారులకు సూచించింది. ఇక కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. 
 
మార్చి 10వ తేదీన ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఏపీలో 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు మార్చి 10న ఎన్నికలు ముగిశాయి. అయితే ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.
 
సింగిల్ జడ్జి ఎన్నికలపై స్టే విధించగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఓ పిటీషనర్ ఆ తీర్పును సవాలు చేశారు. దానిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి నేృతృత్వంలోని ధర్మాసనం ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు అనుమతిచ్చారు. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టకూడదని ఆదేశాలిచ్చింది.
 
ఇదిలావుంటే, ఏలూరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల కౌంటింగ్‌ను ఈనెల 25 న నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. ఈ మేరకు ఎన్నిక‌ల సంఘం కార్య‌ద‌ర్శి కె క‌న్న‌బాబు ఈరోజు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు. మార్చి 10న ఏలూరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రిగాయాంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది. 
 
కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో కొవిడ్ నిబంధనలు ప‌క్కాగా పాటించాల‌ని ఆదేశించింది. పోటీ చేసిన వారు త‌మ కౌంటింగ్ ఏజెంట్ల‌ నియామ‌కానికి ఈనెల 24 సాయంత్రం 5 గంట‌ల్లోగా సూచించిన ఫార్మెట్ ప్ర‌కారం దర‌ఖాస్తుల‌ను రిట‌ర్నింగ్ అధికారికి అందించాల‌ని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది.