బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 జులై 2021 (17:39 IST)

తూగో జిల్లా పి.గన్నవరంలో కంటోన్మెంట్ జోన్లు.. కర్ఫ్యూ

ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా పి.గన్నవరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో అక్కడ కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. అలాగే, కర్ఫ్యూ కూడా అమలు చేయనున్నారు. 
 
కరోనా వైరస్ మహమ్మారి ప్రతి ఒక్కరినీ ఎలా భయభ్రాంతులకు గురిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈ ముప్పు ఇంకా తొలగిపోలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ అతి సమీపంలో ఉందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే దేశంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. ఏపీలో కూడా వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా మారుతోంది. 
 
ముఖ్యంగా ఏపీలోని కోనసీమలో మళ్లీ పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. తీవ్రత పెరగకుండా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 
 
కరోనా మూడో దశలోకి కొనసీమను తీసుకెళ్లకుండా ప్రజలు జాగ్రత్తపడాలని అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి కోరారు. మొదటి, రెండో దశల్లో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. మూడో దశలోకి కొనసీమను తీసుకెళ్లకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. 
 
ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని చెప్పారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మూడవ దశ కోవిడ్ బారిన పడకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
 
ఇంకోవైపు, కోనసీమలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా పి.గన్నవరం మండలంలో పలుచోట్ల కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. మండలంలో పాజిటివ్ రేట్ అధికంగా ఉన్న నేపథ్యంలో వారం రోజుల పాటు పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. 
 
ఈ కర్ఫ్యూ బుధవారం నుంచి వారం రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఉంటుంది. మిగతా సమయాల్లో కర్ఫ్యూ కొనసాగనుంది.