ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 మే 2021 (19:28 IST)

ఖైదీ నంబర్ 3468గా రఘురామరాజు - తక్షణమే ఆస్పత్రికి తరలించాలంటూ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలారు. అక్కడ ఆయన్ను రిమాండ్ ఖైదీగా ఉంసి, 3468 అనే నంబరును కేటాయించారు. ఆయనను జైల్లోని పాత బిల్డింగ్ మొదటి సెల్‌లో ఉంచారు.
 
కాగా, రఘురామకృష్ణరాజుపై తమకు ఎలాంటి కక్షసాధింపు లేదని ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు స్పష్టం చేశారు. రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. 
 
రఘురామకృష్ణరాజుకు చిత్తశుద్ధి ఉంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబే రఘురామకృష్ణరాజు వెనుక ఉండి ప్రభుత్వం, సీఎం జగన్‌పై కుట్రలకు పాల్పడ్డారని శ్రీనివాసులు ఆరోపించారు.
 
మరోవైపు, ఎంపీ రఘురామకృష్ణరాజుకు కాళ్లకు గాయాలు ఎలా తగిలాయన్న దానిపై గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు ఆదివారం నిర్వహించారు. ఈ వైద్య నివేదికను మెడికల్ బోర్డు జిల్లా కోర్టుకు నివేదించగా, జిల్లా కోర్టు ఆ నివేదికను పరిశీలించిన మీదట హైకోర్టుకు అందజేసింది. 
 
రఘురామ వైద్య పరీక్షల నివేదికను ఓ ప్రత్యేక మెసెంజర్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ నివాసానికి పంపింది. హైకోర్టు ఈ మెడికల్ రిపోర్టును హైకోర్టు పరిశీలించింది. 
 
ఆ తర్వాత రఘురామకృష్ణరాజుకు స్వల్ప ఊరట కలిగించేలా ఆదేశాలు జారీచేసింది. ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలని ఏపీ హైకోర్టు సీఐడీ అధికారులను ఆదేశించింది. రఘురామను తక్షణమే రమేశ్ ఆసుపత్రికి పంపాలని స్పష్టం చేసింది. 
 
ఆదివారం సాయంత్రం హైకోర్టులో రఘురామ వైద్య పరీక్షల నివేదికపై విచారణ జరిగింది. వైద్య పరీక్షల నివేదికను పరిశీలించిన స్పెషల్ డివిజన్ బెంచ్... రఘురామ తరపు న్యాయవాదుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంది.
 
కాగా, రమేశ్ ఆసుపత్రిలో పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాన్ని పట్టించుకోలేదని రఘురామ తరఫు న్యాయవాదులు డివిజన్ బెంచ్‌కు విన్నవించారు. కస్టడీలో ఉండగానే సీఐడీ అధికారి పిటిషనర్ (రఘురామ)ను కలిశారని, కస్టడీలో ఉండగా కలవడం చట్టవిరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 
 
అటు, ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, రఘురామకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారని ప్రస్తావించారు.  కొద్దిసేపటి క్రితమే వాదనలు పూర్తి కాగా, ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. సీఐడీ కోర్టు శనివారం ఇచ్చిన ఆదేశాలను అమలు పర్చాలని ఆదేశించింది.