శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 నవంబరు 2022 (19:49 IST)

మూడు రాజధానులకు ఇక అడ్డే లేదు : మంత్రి అంబటి రాంబాబు

ambati rambabu
నవ్యాంధ్ర రాజధాని అమరావతి అంశంపై సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఊరట నిచ్చేలా, మూడు రాజధానుల ఏర్పాటుకును సానుకూలంగా ఉందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అదేసమయంలో అమరావతి యాత్రకు శాశ్వత విరామం పడనుందని ఆయన జోస్యం చెప్పారు. 
 
అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు గతంలో జారీచేసిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా, దీనిపై సోమవారం అపెక్స్ కోర్టులో విచారణ జరిగింది. ఇందులో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సానుకూలంగాను, మరికొన్నింటిపై ప్రతికూలంగా అంటే స్టే విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 
 
దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వికేంద్రీకరణకు బలాన్నిస్తున్నాయని అన్నారు. రాజధానులు 3 నెలలు లేదా ఆరు నెలల్లో నిర్మించాల్సిన అవసరం లేదని అంబటి వ్యాఖ్యానించారు. రాజధానుల నిర్ణయంలో న్యాయస్థానాల జోక్యం సరైందని కాదని దీన్ని బట్టి తేటతెల్లమవుతుందన్నారు. 
 
పైగా, అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు శాశ్వత విరామం ఇచ్చే సమయం ఆసన్నమైందన్నారు. అమరాతిలో గ్రాఫిక్స్ చూపించారే గానీ అమరావతిలో నిర్మాణాలు చేయలేదని విమర్శించారు. రైతుల వేషాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నారని, అమరావతి ప్రాంతంలోని నిజమైన రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
 
అదేసమయంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మూడు రాజధానులకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను చంద్రబాబు ఆపాలని అంబటి హితవు పలికారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో పెద్ద జోకర్ అని అభివర్ణించారు.