రాజీవ్ హంతకులకు స్వేచ్ఛను ప్రసాదించిన సుప్రీంకోర్టు
ఎట్టకేలకు మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసు ముద్దాయిలు విముక్తి పొందారు. వారికి స్వేచ్ఛను సుప్రీంకోర్టు ప్రసాదించింది. రాజీవ్ హంతకును విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వంతో పాటు రాజీవ్ భార్య, కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబం కూడా సముఖత వ్యక్తం చేసిందని, అందువల్ల రాజీవ్ హంతకులను జైలు నుంచి విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
గత 1991 మే 21వ తేదీన తమిళనాడులో శ్రీపెరుంబుదూరలో ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు రాజీవ్ హత్యకు గురయ్యాడు. ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థకు చెందిన మహిళా మానవబాంబు థాను తనను తాను పేల్చుకోవడం ద్వారా రాజీవ్ దారుణ హత్యకు గురయ్యాడు.
ఈ కేసులో నళిని, శ్రీహరన్, శాంతన్, మురుగన్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్, పెరరివాలన్ అనే ముద్దాయిలు తమిళనాడులోని వేలూరు కేంద్ర కారాగారంలో కొన్నేళ్లుగా శిక్షను అనుభవిస్తున్నారు. వీరిలో పెరరివాలన్‌కు సుప్రీంకోర్టు గత మే నెలలో స్వేచ్ఛను ప్రసాదించింది. ఇపుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో మిగిలిన దోషులు కూడా విడుదల కాబోతున్నారు. జస్టిస్ గవాయి, జస్టిస్ బీవీ నాగరత్నంలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.